చెన్నై: 5–3–6–3... మంగళవారం జేమ్స్ అండర్సన్ వేసిన ఒక అద్భుత స్పెల్ ఇది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో లీచ్ 4 వికెట్లు తీసినా... అండర్సన్ బౌలింగే ఇంగ్లండ్ జట్టును విజయంవైపు నడిపించింది. తన జట్టు ఆశించిన విధంగా సూపర్ ‘రివర్స్ స్వింగ్’తో అతను టీమిండియా ఆశలను రివర్స్‌లోకి మార్చేశాడు. ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు మాత్రమే స్వింగ్‌తో చెలరేగిపోతాడని, ఉపఖండంలో రాణించలేడనే అపవాదు ఉన్న అండర్సన్ తన అనుభవం విలువేమిటో, 600కుపైగా వికెట్లు సాధించిన ఘనత ఎలాంటిదో 38 ఏళ్ల వయసులో మళ్లీ నిరూపించాడు.
మబ్బులు కాదు కదా... వేడితో చెమటలు పట్టిస్తున్న చెన్నైలో తన పదునైన బంతులతో అతను చెలరేగాడు. 26 ఓవర్లు వేసిన బంతిని అందుకొని అండర్సన్ మ్యాజిక్ చేశాడు. చివరి రోజు అతని తొలి ఓవర్లోనే లోపలికి దూసుకొచ్చిన బంతిని ఆడలేక గిల్ క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ పతనం మొదలైంది. మరో రెండు బంతులకే రహానేను దాదాపుగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో ఇంగ్లండ్ రివ్యూ కోరగా ‘అంపైర్ కాల్’ కారణంగా రహానే త్రుటిలో బతికిపోయాడు. అయితే తర్వాతి బంతికి అంపైర్ అవసరమే రాలేదు. మళ్లీ బంతి రివర్స్ స్వింగ్ అయి రహానే బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి దూసుకుపోయింది. స్టంప్స్ గాల్లోకి లేవడంతో భారత వైస్ కెప్టెన్ నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు! ఆ తర్వాత పంత్ వంతు వచ్చింది.
భారత రాత మార్చగల అవకాశం ఉందని భావించిన ఈ యువ ఆటగాడిని మరో చక్కటి బంతితో అండర్సన్ బోల్తా కొట్టించగలిగాడు. షాట్ ఎలా ఆడాలనే సందిగ్ధంలో పంత్ షార్ట్ కవర్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తాజా ప్రదర్శనతో అండర్సన్ తనపై ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేశాడు. 2000 నుంచి చూస్తే ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత గడ్డపై గరిష్టంగా 4 టెస్టు విజయాల్లో భాగమయ్యారు. ఆ ముగ్గురు కలిస్, మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా), అండర్సన్. 2006 సిరీస్‌లో ముంబై టెస్టులో గెలిచిన జట్టులో సభ్యుడైన అండర్సన్ 2012లో 2 మ్యాచ్‌లు గెలిచి (ముంబై, కోల్‌కతా) సిరీస్ సాధించిన జట్టులో ఉన్నాడు. తమ స్టార్ ఆటతీరుతో అచ్చెరువొందిన ఇంగ్లండ్ బోర్డు కూడా తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఒకింత హాస్యం, వ్యంగ్యం జోడించి ‘వింతగా లేదూ... ఈ రోజు చెన్నైలో వాతావరణం ఏమాత్రం మేఘావృతమై లేదు’...అంటూ వ్యాఖ్య జోడించడం విశేషం.
చదవండి: 'ఏం బాధపడొద్దు.. మనోళ్లకు ఇది అలవాటే'
ఒక్క విజయంతో టాప్‌కు దూసుకెళ్లింది
Comments
Please login to add a commentAdd a comment