గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వివాహం గురించిన చర్చే ఎక్కుగా నడిచింది. బుమ్రా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే దాని గురించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే నేటితో ఈ ఊహాగానాలకు తెర పడింది. బుమ్రా మనసు గెలిచింది.. తన జీవితంలోకి ప్రవేశించింది ఎవరో తెలిసిపోయింది. కొన్ని గంటల క్రితమే బుమ్రా.. టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహమాడారు. సిక్కు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక సోమవారం జరిగింది.
తమ పెళ్లి ఫొటోలను బుమ్రా, సంజన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రేమ, ఇది విలువైనదని మీరు గుర్తిస్తే.. అదే మీకు మార్గనిర్దేశం చేస్తుంది’’ అని మెసేజ్ కూడా ఇచ్చారు. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా జీవితాల్లో ఎంతో సంతోషకరమైన రోజుల్లో ఈరోజు ఒకటి. మా పెళ్లి వార్తను, మా సంతోషాన్ని మీతో పంచుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్‌ప్రీత్ అండ్ సంజన’’ అని తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో వీరిద్దరు పేర్కొన్నారు.
ఇక పెళ్లికి ముందు వరకు కూడా వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఒక్క మాట మాట్లడలేదు. ఎక్కడా బయటపడలేదు. ఈ రోజు ఏకంగా పెళ్లి ముచ్చట చేప్పేశారు. బుమ్రా నాలుగో టెస్టు నుంచి తప్పుకోవడం పట్ల బీసీసీఐ తన ప్రకటనలో ‘ఆయన వ్యక్తిగత కారణాల వల్ల’ అని మాత్రమే పేర్కొంది. ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, రెండు రోజులుగా బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి సోమవారం నాడు సంజనను పెళ్లాడి బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు.
ఇదిలా ఉంటే, అసలు బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేషన్ ఎవరు.. అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది అనే తదితర అంశాల గురించి చర్చిస్తున్నారు నెటిజనులు. వాటికి సమాధానమే ఈ స్టోరి.. క్రీడలను ముఖ్యంగా క్రికెట్‌ను అభిమానించే వారికి సంజనా గణేశన్ పరిచయమే. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్, బ్యాడ్‌మింటన్ టోర్నమెంట్ల సందర్భంగా పలు స్పేషల్ షోలు హోస్ట్ చేశారు సంజన. ఇక ఆమె వ్యక్తిగత వివరాలకు వస్తే.. సంజనా గణేశన్ స్వస్థలం పుణె. 1991 మే 6న ఆమె జన్మించారు. అక్కడే బీటెక్ వరకు చదివారు. మోడలింగ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచారు.
2014లో ఎంటీవీ స్ల్పిట్స్‌విల్లా షో సీజన్ 7 ద్వారా సంజన గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్నారు సంజన. తన ఇన్‌స్టాగ్రామ్ బయోగ్రఫీలో ‘‘టీవీ ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్’’ అని పేర్కొన్నారు. గతేడాది దుబాయ్‌లో జరగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ప్రజెంటర్‌గా పని చేశారు సంజన. ఈ సందర్భంగా సంజనా.. ఇండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ అంజుమా చోప్రాతో కలిసి దిగిన ఫోటోతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని ఇంటర్వ్యూ చేస్తూ దిగిన ఫోటోలని షేర్ చేశారు.
2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ వంటి షోలను ఆమె హోస్ట్ చేశారు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కూడా సంజన హోస్ట్ చేశారు. వీటితో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తోనూ సంజన ఒప్పందం చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కమర్షియల్ షో ‘ద నైట్ క్లబ్’కు సంజన యాంకర్‌గా వ్యవహరించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment