దుబాయ్ : కివీస్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్.. భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్‌చోప్రా మధ్య మాటల యుద్దం ఆసక్తికరంగా సాగింది. నీషమ్ స్థానం గురించి ఆకాశ్ చోప్రా ప్రశ్నించడం పట్ల దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున జిమ్మీ నీషమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. నీషమ్ సెప్టెంబర్ 27న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. తరువాత అక్టోబర్ 1న ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడాడు. అయితే నీషమ్ ఆడిన రెండు మ్యాచ్‌లు కింగ్స్ ఓడిపోయింది.. దీంతో నీషమ్‌కు బ్యాడ్ ఎంట్రీగా మారింది. (చదవండి : చాలా కష్టంగా ఉంది.. ధోనీకేమైంది?)
ఆర్‌ఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ దిగి 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు.. బ్యాటింగ్‌లోనూ 8 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఆకాశ్ చోప్రా నీషమ్ ఎంపికను తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీషమ్ స్థానంలో 2018 నుంచి కింగ్స్ జట్టుతో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను ఆడిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.
'జిమ్మీ నీషమ్‌ను ఒక విదేశీ ఆటగాడిగా.. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తాడని కింగ్స్ జట్టులోకి తీసుకుంది. కానీ ఒక బౌలర్‌గా నీషమ్ అటు పవర్‌ప్లేలో లేదా డెత్ ఓవర్లలో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. మంచి ఫినిషర్ అని పేరున్న నీషమ్ బ్యాటింగ్‌లోనూ టాప్ 5లోనూ కనిపించడు. మరి అలాంటప్పుడు కింగ్స్ పంజాబ్ జట్టు అతన్ని ఎందుకు ఆడిస్తున్నట్టు.. వాళ్లు మ్యాచ్ విన్నర్ అని భావించి ఆడిస్తున్న నీషమ్ సరైన ఆటగాడు కాదు. సరిగ్గా చెప్పాలంటే కింగ్స్ జట్టు సరైన టీమ్‌ను ఎంపిక చేసుకోవడం లేదు. ముజీబ్ లాంటి మిస్టరీ స్పిన్నర్‌ను తుది జట్టులో ఆడించకపోవడం పట్ల కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. అంటూ తెలిపాడు.
అయితే చోప్రా వ్యాఖ్యలకు జిమ్మీ నీషమ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. చోప్రా టీ20 ప్రదర్శన.. అతని పూర్ స్ట్రైక్‌రేట్.. సగటును చూపిస్తూ ట్వీట్ చేశాడు. ఆకాశ్ చోప్రా తన కెరీర్‌లో మొత్తం 21 టీ20లు ఆడి 91 స్ట్రైక్‌రేట్‌తో 18.55 సగటుతో 334 పరుగులు చేశాడు.'90 స్ట్రైక్‌రేట్.. 18.5 సగటుతో ఎవరైనా మ్యాచ్‌లను గెలిపించగలరా.. ముందు మీ ఆటతీరు చూసుకొండి.. ఆ తర్వాత కామెంట్ చేయండి 'అంటూ కౌంటర్ ఇచ్చాడు. (చదవండి : ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా)
అయితే ఆకాశ్ చోప్రా వెంటనే స్పందిస్తూ.. ' నీషమ్.. నువ్వు చెప్పింది నిజమే.. అందుకే ఆ తర్వాత నన్నెవరు కొనుగోలు చేయలేదు.. ఆడించలేదు. అందుకే వేరే రూపంలో డబ్బు సంపాదిస్తున్నాను. నా ఆటకు సంబంధించిన గణాంకాలను గుర్తించినా మీతో పోల్చనందుకు సంతోషమే. కనీసం ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లైనా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. అంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 4న సీఎస్‌కేతో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment