ధోనితో రుతురాజ్ గైక్వాడ్ (PC: CSK/IPL)
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని సీఎస్‌కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది.
What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024
pic.twitter.com/WCLqVI4xyU
అందుకు అనుగుణంగానే సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్‌కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్‌గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు.
ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు.
అలా అయితే కెప్టెన్సీ కష్టం
అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్‌కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు.
ఆ ఎడిషన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్‌కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్‌గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment