చెన్నై: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకం సాధించిన రూట్ .. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు 100వ టెస్టులో సెంచరీ సాధించిన వారిలో రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, గ్రేమీ స్మిత్, ఇంజమామ్ ఉల్ హక్ తదితరులు ఉన్నారు. అంతేగాక వరుసగా 98,99,100వ టెస్టులో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు.
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో వరుస సెంచరీలు(228, 186 పరుగులు)తో ఊపుమీద కనిపించిన రూట్ అదే ఫామ్‌ను టీమిండియాపై కొనసాగించాడు. 164 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రూట్ తన శైలికి కాస్త భిన్నంగా ఆడడం విశేషం.తొలి ఆఫ్ సెంచరీ సాధించడానికి 114 బంతులు తీసుకున్న రూట్ .. ఆ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 50 బంతుల్లోనే చేయడం విశేషం. వన్‌డౌన్‌లో వచ్చిన డానియెల్ లారెన్స్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన రూట్ మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లితో కలిసి క్రీజులో పాతుకుపోయాడు. ఓపెనర్ సిబ్లితో కలిసి ఇప్పటికే 160 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరిగెడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 81 ఓవర్లలో 241 పరుగులు చేసింది. జో రూట్ 109, సిబ్లి 85 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment