
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో ఇంగ్లండ్ 55/6... ఇక ఆలౌట్ కావడమే ఖాయం అనుకుంటున్న తరుణంలో బెయిర్‌స్టో అద్భుతం చేశాడు. గత టెస్టులో 77 బంతుల్లో మెరుపు శతకంతో చెలరేగిన అతను ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో అదే తరహాలో ఎదురుదాడితో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లపై చెలరేగి 95 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
బెయిర్‌స్టో (126 బంతుల్లో 130 బ్యాటింగ్; 21 ఫోర్లు)కు తోడు అరంగేట్ర టెస్టు ఆడుతున్న జేమీ ఓవర్టన్ (106 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 264 పరుగులు చేసింది.
బెయిర్‌స్టో, ఓవర్టన్ ఏడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 209 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరో 65 పరుగులే వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 225/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (109; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిరీస్‌లో వరుసగా మూడో టెస్టులోనూ సెంచరీ చేయడం విశేషం.
చదవండి: Ranji Trophy2022 Final: రంజీ ఫైనల్.. దుమ్మురేపిన యష్ దూబే, శుభమ్ శర్మ