దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటి రోడ్స్ ఖాతాను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. భారత్‌లో రైతుల ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో అంతర్జాతీయంగానూ మద్దతు లభిస్తోంది. యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, పాప్ సింగర్ రిహన్న వంటివారు రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని, కేవలం వారు ప్రేక్షక పాత్ర వహిస్తే చాలని మన దేశానికి చెందిన క్రీడా, సినీ ప్రముఖులు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వంటివారు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో సచిన్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తన ట్విటర్ ఖాతాలో దర్శనమిచ్చిందని జాంటి రోడ్స్ తెలిపారు. నా ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్టుగా ఉంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. సచిన్ స్క్రీన్ షాట్ నేను జోడించలేదు’ అని రోడ్స్ ఇన్‌స్టాలో చెప్పుకొచ్చారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో జాంటిరోడ్స్ బెస్ట్ ఫీల్డర్‌గా వెలుగొందారు. ఇక ‘భారత దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. బాహ్య శక్తులు ప్రేక్షకులుగా ఉంటే మంచిది. భారత దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు. మన దేశం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు. దేశం కోసం ఏం చేయాలో తెలుసు. ఒక జాతిగా ఐక్యంగా ఉందాం’ అని సచిన్ ట్విటర్‌లో బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment