'నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'.. అభిషేక్‌పై బట్లర్ ప్రశంసల జల్లు | Jos Buttler in awe of Abhishek Sharma's superlative knock in 5th T20I | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'.. అభిషేక్‌పై బట్లర్ ప్రశంసల జల్లు

Published Mon, Feb 3 2025 12:29 PM | Last Updated on Mon, Feb 3 2025 12:53 PM

Jos Buttler in awe of Abhishek Sharma's superlative knock in 5th T20I

అభిషేక్‌ శర్మ-బట్లర్‌(ఫైల్‌ ఫోటో)

టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ ఘోర ప‌రాభావంతో ముగించింది. ముంబై వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇంగ్లండ్ తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.

భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ( 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135) మెరుపు సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్‌ చక్రవర్తి, దూబే, అభిషేక్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. 

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై బట్లర్‌​ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ సిరీస్‌ను కోల్పోవ‌డం మ‌మ్మ‌ల్ని తీవ్ర‌ నిరాశకు గురిచేసింది. . కానీ కొన్ని విభాగాల్లో మాత్రం మేము మెరుగ్గానే రాణించాము. ఈ ఓటమి నుంచి కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. స్వదేశంలో భారత జట్టుకు తిరుగులేదు. వారిని ఓడించడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో మా బౌలర్లు బాగానే రాణించారు. 

ఆఖరికి ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో కూడా బ్రైడన్ కార్స్‌, మార్క్ వుడ్ అద్బుతంగా రాణించారు. ఇక అభిషేక్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న త‌క్కువే. నేను ఇప్ప‌టివ‌ర‌కు నా కెరీర్‌లో ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శ‌ర్మ లాంటి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ను చూడడం ఇదే తొలిసారి. 

ఇక మా జ‌ట్టులోకి జో రూట్ తిరిగొచ్చాడు. అత‌డు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒక‌డు. వ‌న్డే సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.  టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరా హోరీగా సాగుతోంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. 

కాగా ఫిబ్రవరి 6 నుంచి నాగ్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జైశ్వాల్‌, కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో వన్డేలకు బరిలోకి దిగనున్నారు.

ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా.

భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్‌ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్‌, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్‌​.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement