India Vs West Indies Test Series: ‘‘18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి.. తిరిగొచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్.. వైస్ కెప్టెన్‌గా నియమితుడు కావడం. ఇలాంటి ఎంపిక నేనెప్పుడూ చూడలేదు. జట్టులో చాలా కాలం నుంచి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజా ఉన్నాడు.
నిజానికి అతడు కదా అసలైన క్యాండిడేట్. కానీ ఓ వ్యక్తి ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేసి ఒక్క మ్యాచ్ ఆడగానే వైస్ కెప్టెన్ అవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో సెలక్టర్ల తీరు నాకైతే అర్థం కాలేదు. ఏదో తూతూ మంత్రంగా జట్టును ఎంపిక చేసినట్లు ఉండకూడదు. సెలక్షన్ విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.
రోహిత్ డిప్యూటీగా అతడే ఎందుకు?
వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఎంపిక చేసిన టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా అజింక్య రహానేకు స్థానం ఇవ్వడంపై ఘాటు విమర్శలు చేశాడు. అదే విధంగా.. సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా విషయంలో సెలక్టర్ల తీరును విమర్శించాడు.
కాగా దాదాపు ఏడాదిన్నరగా జట్టుకు దూరమైన రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా జట్టులోకి తిరిగి వచ్చి.. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
పుజారా విషయంలో ఏం ఆలోచిస్తున్నారు?
మరోవైపు.. పుజారా జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘పుజారాను జట్టులో కొనసాగిస్తారా లేదంటే.. అతడి వారసుడిగా యువ క్రికెటర్లలో ఎవరినైనా తయారు చేస్తారా అన్న విషయంపై ముందుగా స్పష్టతకు రావాలి.
పుజారా లాంటి మేటి ఆటగాడిని జట్టు నుంచి తప్పించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతేగానీ ఓ సిరీస్‌కు ఎంపిక చేసి.. ఆ వెంటనే తదుపరి సిరీస్‌కు తప్పించడం సరికాదు. అజింక్య రహానే విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని గంగూలీ.. సెలక్టర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది.
వెస్టిండీస్ రెండు టెస్టులకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి తెలుగు కుర్రాడు!
Comments
Please login to add a commentAdd a comment