శుబ్‌మన్ గిల్‌తో యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. యశస్వి బ్యాటింగ్ తీరు చూస్తే తనకు సౌరవ్ గంగూలీ గుర్తుకువస్తాడని తెలిపాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ ఆడటంలో ఈ ముంబై బ్యాటర్ దిట్ట అంటూ కొనియాడాడు.
కాగా వెస్టిండీస్ గడ్డపై శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఇటీవలే తొలి డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
తదుపరి రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు యశస్వి జైస్వాల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో యశస్వి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఈ సిరీస్‌లో నేను ఎవరి ఆట కోసమైనా ఎదురుచూస్తున్నానంటే అది యశస్వి జైస్వాల్ మాత్రమే! ఐపీఎల్‌లో అతడు ఎలా ఆడతాడో మనమంతా చూశాం. అత్యద్భుతమైన ఆటగాడు.
దాదా మాదిరే ఆఫ్ సైడ్ గేమ్ చితక్కొడతాడు. నిజానికి తనను ఆఫ్ సైడ్ రారాజు అని పిలవొచ్చు. ఒకవేళ వచ్చే పదేళ్ల పాటు అతడు జట్టులో కొనసాగితే.. తప్పకుండా దాదా మాదిరే ప్రభావం చూపగలడు.
మనం ఇప్పుడు దాదా గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే యశస్వి గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్‌లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో యశస్వి మరోసారి నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులాడి 637 పరుగులు, 17 టీ20లలో 502 పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియా మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా.. కెప్టెన్ రోహిత్ శర్మ జోడీగా కొనసాగుతున్నాడు.
చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే!
Comments
Please login to add a commentAdd a comment