సిడ్నీ: స్లెడ్జింగ్ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. మ్యాచ్ మధ్యలో సరదా సంభాషణలకు చోటు ఉంటుందని, పోటీతత్వంతో ముందుకు సాగాలే తప్ప అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. కాగా ఆస్ట్రేలియా జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల దృష్టి మరల్చేందుకు మాటల యుద్ధానికి దిగుతూ వారిని మానసికంగా దెబ్బకొట్టడం ఆసీస్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా గతంలో వారు అనేక విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ ఆటగాళ్లు కాస్త దూకుడు తగ్గించారు.(చదవండి: ఓపెనర్‌గా అతడే సరైన ఆప్షన్: సచిన్)
కాగా ప్రస్తుతం టీమిండియా సుదీర్ఘ ఆసీస్ పర్యటన నేపథ్యంలో జస్టిన్ లాంగర్ ఈ విషయం గురించి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో మీరు గమనించవచ్చు. మైదానం లోపల, వెలుపల మా ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా సరదా సంభాషణలకు, పరిహాసాలకు చోటు ఉంటుందేమో గానీ, అసభ్య దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక 2018-19 నాటి భారత పర్యటనలో ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పెన్- టీమిండియా సారథి కోహ్లి మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి వ్యవహారశైలిని మేమెంతగానో ప్రేమిస్తాం.
అందులో హాస్య చతురతే తప్ప, అంతగా తప్పుబట్టాల్సిన విషయమేదీ లేదు. నిజానికి ఆసీస్- ఇండియా సిరీస్ అంటే ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో మజాను పంచుతుంది. ఆర్థికంగా కూడా టీమిండియా టూర్ ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంతగానో అవసరం’’ అని పేర్కొన్నాడు. ఇక యువ ఆటగాడు విల్ పుకోవ్‌స్కీను జట్టులోకి తీసుకునే అంశం గురించి లాంగర్ మాట్లాడుతూ.. ‘‘అమోఘమైన ప్రతిభ అతడి సొంతం. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా అతడు టెస్టు తుదిజట్టులోకి వస్తాడు. అది ఈ సిరీస్‌లోనైనా లేదా వచ్చే సిరీస్‌లోనైనా కావొచ్చు’’ అని అతడి అరంగేట్రంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: కోహ్లి దూరం: ఆ చాన్స్ కొట్టేస్తే లక్కీయే!)
Comments
Please login to add a commentAdd a comment