హైదరాబాద్: ఆటగాళ్లకు గాయాలు, కెప్టెన్ కోహ్లీ గైర్హాజరు.. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం అద్భుతమని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాల్లో తాను చూసిన అపూర్వ గెలుపు ఇదేనన్నాడు. రానున్న ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ భారత్ ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. వికారాబాద్‌లోని హల్దీ గోల్ఫ్ క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కపిల్ దేవ్ పలు అంశాలపై ముచ్చటించాడు.
'ఆస్ట్రేలియాలో భారత జట్టు అద్భుతం చేసింది. అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. షమీ, ఉమేశ్ ఆ తర్వాత అశ్విన్, జడేజా, విహారి ఇలా సగం జట్టుకన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. అలాంటి సమయంలో ఆసీస్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలుస్తుందని నేను ఊహించలేదు. అయితే టీమ్‌ఇండియా వీరోచితంగా పోరాడింది. అలాంటి ఆట ఆడిన భారత జట్టుకు హ్యాట్సాఫ్. గత నాలుగు దశాబ్దాల్లో నేను చూసిన అద్భుతమైన ఆట ఇదే. స్వదేశంలో త్వరలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ భారత్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. ఆసీస్‌లో చరిత్రాత్మక విజయం తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.
చదవండి: అతన్ని ఎదుర్కోవడం కష్టమే
కెప్టెన్ ఎంపిక అంశం సెలెక్టర్లకే వదిలేయాలి. ఒకవేళ మూడు ఫార్మాట్లకు సారథ్యం వహించి విపరీతమైన ఒత్తిడికి గురయితే విశ్రాంతి ఇవ్వొచ్చని నేను అనుకుంటా. మన దేశంలో ఫార్మాట్‌కో కెప్టెన్ ఉండడం కష్టం. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించగల ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ వల్ల చాలా మంది ప్లేయర్లు అనుభవం గడించారు. విరాట్ లేకపోయినా ఆస్ట్రేలియాలో భారత జట్టు ఏం చేసిందో చూశాం. రహానే అమోఘంగా జట్టును ముందుకు నడిపాడు. ఉన్నది తక్కువ అనుభవమే అయినా.. ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రోహిత్ కూడా మెరుగైన కెప్టెన్‌గానే పరిగణించవచ్చు.
భారత క్రికెట్‌లో యువ ప్రతిభావంతులకు కొదువ లేదు. ఎందరో టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు. అయితే నిలకడగా సత్తాచాటాలి. శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా లాంటి అద్భుతమైన ఆటగాళ్లు వస్తున్నారు. అయితే యువ ప్లేయర్లు సుదీర్ఘ కాలం పాటు నిలకడగా ఆడడం పట్ల దృష్టిసారించాలి. యువకులు అదరగొడుతుంటే చూడాలనదే నా ఆశ. 'అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'స్వదేశానికి వచ్చాక అస్సలు టైం దొరకలేదు'
Comments
Please login to add a commentAdd a comment