‘ఫలితాలతో సంబంధం లేకుండా మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడటమే మా కొత్త విధానం. గత ఏడాది కాలంగా ఇదే తరహా ఆట ఆడుతున్నాం. మా జట్టులో వచ్చిన కీలక మార్పు ఇది’ ఇటీవల పదే పదే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది.
సంవత్సర కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఇది పని చేసింది కూడా. కానీ వరల్డ్ కప్‌కు వచ్చేసరికి మళ్లీ పాత తరహా ఆటనే. ఈ టోర్నీలో పవర్‌ప్లేలో భారత జట్టు ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు చేసింది. మొత్తం జట్లలో నెదర్లాండ్స్, జింబాబ్వే మాత్రమే ఇంతకన్నా తక్కువ రన్‌రేట్‌తో ఆడాయి.
మన జట్టు శైలి ఎలా ఉందో చెప్పేందుకు ఇది చాలు. సెమీస్‌లో కూడా చాలా సాంప్రదాయిక పద్ధతిలో, దూకుడు అనేదే లేకుండా టీమ్ ఆడింది. సాధారణంగా ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లతో పాటు ఒకరిద్దరు బలహీన బౌలర్లు ఉంటారు.
వారిని లక్ష్యంగా చేసుకోవాలి. లివింగ్‌స్టోన్‌ను కూడా మనోళ్లు కొట్టలేకపోయారు. ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు కాపాడుకుంటూ ఆడటం, చివ ర్లో చెలరేగిపోవడం అనే శైలిలో భారత్ ఆట సాగింది. అయితే ఆ వ్యూహం సెమీస్‌లో పని చేయలేదు.
►పాక్‌పై అద్భుత విజయంతో భారత అభిమానుల ఆశలను టీమిండియా ఆకాశానికి తీసుకెళ్లింది. ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయంతో జట్టులోని పలు లోపాలు కూడా బయటకు రాకుండా పోయాయి.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త మేలుకునేలా చేసినా, బంగ్లాదేశ్ కూడా చివరి వరకు చెమటలు పట్టించింది! సరిగ్గా చెప్పాలంటే జింబాబ్వేపై మినహా మరే మ్యాచ్‌లోనూ భారత జట్టు సంపూర్ణ, సమష్టి ప్రదర్శన ఇవ్వలేకపోయింది.
►అంతర్జాతీయ టి20ల్లో 4 సెంచరీలు సహా విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన రోహిత్ పూర్తిగా తేలిపోవ డం జట్టును దెబ్బ తీసింది. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 116 పరుగులు అదీ 106 స్ట్రయిక్‌రేట్‌తో చేయడం నిజంగా ఆశ్చర్యకరం! నెదర్లాండ్స్‌లాంటి బలహీన జట్టుపై మాత్రమే హాఫ్ సెంచరీ వచ్చింది.
ఇక రాహుల్ గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. మొత్తం 128 పరుగులు చేసిన అతను ప్రధాన జట్లయిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై పూర్తిగా విఫలమయ్యాడు. కోహ్లి ఒక్కడే నాలుగు అర్ధ సెంచరీలతో (మొత్తం 296 పరుగులు) జట్టు జెండా మోశాడు. సూర్యకుమార్ అసలు పోరులో విఫలమయ్యాడు.
►బౌలింగ్‌లో ఆడుతున్న తొలి వరల్డ్‌కప్‌లోనే అర్ష్‌దీప్ ఆకట్టుకోగా, భువనేశ్వర్ కూడా లయ అందుకున్నాడు. బుమ్రా లేని లోటును షమీ సరిగానే పూరించాడు. సెమీస్ మ్యాచ్ మినహా అతని బౌలింగ్ బాగా సాగింది. కార్తీక్, పంత్‌లలో ఒకరిని తేల్చు కునే విషయంలో సందిగ్ధతను ఆసాంతం కొనసాగించాం. లీగ్‌లో ఒక్క మ్యాచ్ ఆడించి సెమీస్‌లో ఫినిషర్ పాత్ర ఇస్తే పంత్ ఏం చేయగలడు!
►ఇక అన్నింటికంటే ఎక్కువ ఆశ్చర్యపర్చిన నిర్ణయం లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఒక్క మ్యాచ్ కూడా దక్కకపోవడం. గత టి20 ప్రపంచకప్‌లో చహల్ లేకపోవడంతో అటాకింగ్ బౌలర్ తగ్గాడంటూ విమర్శలు రావడంతో తర్వాతి సిరీస్‌లోనే అతనికి అవకాశం లభించింది. వరల్డ్ కప్ ముందు వరకు అన్ని మ్యాచ్‌లలో ఆడించి అసలు సమరంలో అతడికి డ్రింక్స్ ఇచ్చే పనికే సరిపెట్టారు.
అశ్విన్‌పై అపార నమ్మకంతో కనీసం లెగ్‌స్పిన్నర్‌తో ఒక మ్యాచ్‌లో ప్రయత్నించే సాహసం కూడా టీమ్ చేయలేకపోయింది. అలా అని అశ్విన్ కూడా అద్భుతాలేమీ చేయలేదు. బ్యాటింగ్‌కు పనికొస్తారనే కారణంతో అతడిని, అక్షర్ పటేల్‌ను ఆడించడం అంటే టాప్–7 బ్యాటింగ్‌పై జట్టుకు నమ్మకం లేనట్లా!
►2021 వరల్డ్‌కప్‌లో లీగ్ దశకే పరిమితమైన తర్వాత కోహ్లి కెప్టెన్సీపై కూడా విమర్శలు వచ్చాయి. అదే స్థానంలో రోహిత్ ఉండి ఉంటే ఎలా చేసే వాడో విశ్లేషణలు వచ్చాయి. అయితే ఐదు ఐపీఎల్ టైటిల్స్ అనుభవం అంతర్జాతీయ మ్యాచ్‌లకు పనికి రాలేదు.
రోహిత్ కూడా వ్యూహాలు, ప్రణాళి కల విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. అతని నాయకత్వ ప్రతిభను చూపించే ఒక్క ఘటన కూడా టోర్నీలో కనిపించలేదు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటూ తీర్చిదిద్దిన హర్షల్‌ను పెవిలియన్‌కే పరిమితం చేయడం రోహిత్ ఆత్మరక్షణ ధోరణిని చూపించింది.
►చివరగా... దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ మొదలుకొని ఇంగ్లండ్‌తో టెస్టులో ఓటమి, రెండు వరల్డ్‌కప్‌లలో వైఫల్యం... తాజా ప్రదర్శన వరకు కోచ్‌గా ద్రవిడ్‌కు ఫెయిల్ మార్కులే పడ్డాయి. మరి ఆయనను ప్రశ్నించే సమయం ఎప్పుడొస్తుందో?
సెమీస్‌లో ఎందుకు ఓడామంటే...
► సూర్యకుమార్ జోరుకు సరైన వ్యూహంలో ఇంగ్లండ్ అడ్డుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు అతను ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన వాటిలో అత్యధిక బంతులు బాగా వేగవంతమైనవే. బంతి ఎంత వేగంగా వస్తే సూర్య అంతే వేగంగా బౌండరీ దాటించాడు. అందుకే అటు రషీద్ స్పిన్‌తో పాటు ఇటు అన్నీ స్లో బంతులే వేసింది. దాంతో ఆ ఉచ్చులో సూర్య చిక్కాడు.
►రెగ్యులర్ లెగ్ స్పిన్నర్ రషీద్, పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్ లివింగ్‌స్టోన్ కలిసి 7 ఓవర్లలో 41 పరుగులే ఇచ్చారు. నిజానికి ఎడంచేతి వాటం ఆటగాళ్లు లెగ్ స్పిన్నర్లపై విరుచుకు పడవచ్చని, అడిలైడ్‌లో స్క్వేర్‌లెగ్ బౌండరీలు చిన్నవి కాబట్టి వేగంగా పరుగులు రాబడతాడనే రిషభ్ పంత్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. అయితే ఇదంతా వృథా అయింది. పంత్ క్రీజ్‌లోకి వచ్చేసరికి ఈ 7 ఓవర్లూ ముగిసిపోయాయి.
► తొలి 15 ఓవర్లలో భారత్ 2 సిక్సర్లే కొట్టగలిగింది. ఇంగ్లండ్ సరైన వ్యూహంతో స్క్వేర్‌లెగ్ బౌండరీల వైపు పరుగులే ఇవ్వలేదు.
చదవండి: Shoaib Akhtar: ఈ ఆటతీరుతో ప్రపంచకప్ ఫైనల్‌కా?.. పాక్‌తో తలపడే అర్హత టీమిండియాకు లేదు..
Comments
Please login to add a commentAdd a comment