ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2022లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిందిస్తున్నారు. సోషల్‌మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు.
అసలు వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం.
బౌలింగ్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్ బ్యాటింగ్‌లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్ ఓపెనర్‌ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల శ్రేయస్ అయ్యర్‌ను కాదని దీపక్ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్ లాంటి నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను గుర్తించలేకపోవడం, ఫినిషర్ అంటూ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్ కాని అశ్విన్‌ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్‌కు న్యాయం చేయలేని అక్షర్ పటేల్‌ను ఆల్‌రౌండర్ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వరల్డ్‌కప్ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది.
వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్‌కప్‌కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్ టాలెంట్‌ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు.
ఆస్ట్రేలియా పిచ్‌లకు సూటయ్యే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్‌సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్‌ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి.
అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్‌ను, సీనియర్ ఆటగాళ్లను, కోచ్‌ను టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్‌లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది.
చదవండి: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment