అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..? | CWC 2023 IND VS ENG: Fans Slam BCCI For Poor Ground Maintenance In WC | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS ENG: అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..?

Published Sun, Oct 29 2023 7:51 PM | Last Updated on Mon, Oct 30 2023 9:31 AM

CWC 2023 IND VS ENG: Fans Slams BCCI For Poor Ground Maintenance In WC - Sakshi

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌పై సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మ్యాచ్‌ జరుగుతున్న వైనాన్ని పక్కన పెట్టి బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్‌కు వేదిక అయిన అటల్‌ బిహారీ స్టేడియం నిర్వహణ తీరు పంట పొలాల కంటే అధ్వానంగా ఉందంటూ దుయ్యబడుతున్నారు. భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ క్యాచ్‌ పడుతూ లివింగ్‌స్టోన్‌ గాయపడిన తీరును ట్రెండ్‌ చేస్తూ బీసీసీఐని ఎండగడుతున్నారు. 

ఏం​ జరిగిందంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కఠినమైన పిచ్‌పై అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో లివింగ్‌స్టోన్‌ కిందపడి గాయపడ్డాడు. లివింగ్‌స్టోన్‌ ఆ రీతిలో గాయపడటానికి మైదానంలోని పచ్చిక కారణం​ కావడమే బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

లివింగ్‌స్టోన్‌ కిందపడ్డ సమయంలో మైదానంలోని ఆ ప్రాంత పరిస్థితి పంట పొలాలను తలపించడంతో మన క్రికెటర్లు అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..? అంటూ  వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు. 

గతంలో ధర్మశాల వేదికగా జరిగిన బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్‌ సందర్భంగా ఆఫ్ఘన్‌ ఆటగాడు ముజీబ్‌ బౌండరీ ఆపే ప్రయత్నంలో మైదానంలోని పచ్చిక కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో ఆ గ్రౌండ్‌ నిర్వహణపై పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మశాల స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పనికిరాదని బహిరంగ ప్రకటనలు చేశారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్‌స్టో (14), మలాన్‌ (16), రూట్‌ (0), స్టోక్స్‌ (0) ఔట్‌ కాగా.. బట్లర్‌ (5), మొయిన్‌ అలీ (4) క్రీజ్‌లో ఉన్నారు. బుమ్రా, షమీ తలో 2 వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement