దుబాయ్ : ఐపీఎల్ అంటేనే దనాధన్ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అయితే సిక్సర్ల వీరుడిగా పేరు పొందిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మరోవైపు కింగ్స్ పంజాబ్ ఈ సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. కింగ్స్ జట్టులో ఓపెనర్లు రాహుల్, మాయాంక్, మరో ఆటగాడు నికోలస్ పూరన్ మినహా మిగతా ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన మరింత కలవరపరుస్తుంది.
ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ గేల్ రాకపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' వరుస ఓటములు మా జట్టును తీవ్రంగా బాధిస్తున్నాయి. క్రిస్ గేల్, ముజీబ్ ఉర్ రెహమన్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తుంది. వారిద్దరిని తుది జట్టులోకి తీసుకోకపోతే మేం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లేఆఫ్స్‌కు సమయం దగ్గరైన కొద్దీ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన దశలో తుది జట్టులోకి తీసుకోవాలని ఎవరు అనుకోరు. వారిని తీసుకునేందుకు ఇప్పుడే మంచి అవకాశం.. రానున్న మ్యాచ్‌ల్లో అది జరగవచ్చు. ఇక గేల్ తన విధ్వంసాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను ఫామ్‌లో ఉంటే ఎలాంటి విధ్వంసముంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (చదవండి : నచ్చినవారిని వదిలిరావడం ఎంతో కష్టం')
ఇప్పుడు మాకు మ్యాచ్ విన్నర్స్ అవసరం చాలా ఉంది. గేల్ లాంటి ఆటగాడు ఫామ్‌లో ఉంటే.. నాలుగైదు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. రానున్న తొమ్మిది మ్యాచ్‌ల్లో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలిస్తే గాని టాప్-4 లో నిలిచే అవకాశం ఉంటుంది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే కొనసాగాలనే నిబంధన ఉండడంతో క్రిస్ గేల్ కోసం మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతావాళ్లలో బ్యాటింగ్ విభాగంలో నికోలస్ పూరన్, బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్‌లు ఉన్నారు. ముజీబ్ కోసం వీరిలో ఎవరు ఒకరు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. నికోలస్ పూరన్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో అతన్ని తీసే పరిస్థితి లేదు. మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను తుదిజట్టులోకి రావాలి. ఇదే విషయమై కెప్టెన్ రాహుల్, ప్రధాన కోచ్ కుంబ్లేతో మాట్లాడాలి.' అంటూ తెలిపాడు.
కాగా ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అసలు ఆటలోకి వచ్చేసరికి మాత్రం చతికిలపడుతుంది. ఢిల్లీతో జరిగిన మొదటిమ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైన కింగ్స్ ఆ తర్వాత ఆర్‌సీబీపై 97 పరుగులతో విజయం సాధించింది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లు రాణిస్తున్నా మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో వరుస ఓటములను చవిచూస్తుంది. కాగా కేఎల్ రాహుల్ 342 పరుగులతో ఐపీఎల్ 13వ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment