వరుణ్‌ పాంచ్‌ పటాకా.. కేకేఆర్‌ ‘సిక్సర్‌’ | KKR Beat Delhi By 59 Runs | Sakshi
Sakshi News home page

వరుణ్‌ పాంచ్‌ పటాకా.. కేకేఆర్‌ ‘సిక్సర్‌’

Oct 24 2020 7:19 PM | Updated on Oct 24 2020 7:19 PM

KKR Beat Delhi By 59 Runs - Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న కేకేఆర్‌.. అటు తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించి గెలుపును అందుకుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి135 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ విలవిల్లాడింది. వరుణ్‌ ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు.  అయర్య్‌, పంత్‌, హెట్‌మెయిర్‌,  స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో విజయంతో కేకేఆర్‌ ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఇక తొలి అంచె మ్యాచ్‌లో ఢిల్లీపై ఎదురైన ఓటమికి కేకేఆర్‌ ఘనమైన ప‍్రతీకారం తీర్చుకుంది. ఇది ఢిల్లీకి నాల్గో ఓటమి. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6)లు నిరాశపరిచారు. వీరిద్దర్నీ కమిన్స్‌ తన వరుస ఓవర్లలో బోల్తా కొట్టించడంతో ఢిల్లీ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 5ఫోర్లు), రిషభ్‌ పంత్‌(27; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఆకట్టుకునే యత్నం చేసినా కీలక భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు. ఈ జోడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా, ఆపై ఎవరూ కూడా రాణించకపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్‌ ఐదు వికెట్లకు తోడుగా కమిన్స్‌ మూడు వికెట్లు సాధించగా ఫెర్గ్యూసన్‌కు వికెట్‌ లభించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194  పరుగులు చేసింది. నితీష్‌ రాణా(81; 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), నరైన్‌(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు. అయితే నోర్జే వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి గిల్‌(9; 8 బంతుల్లో 2 ఫోర్లు) ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ క్యాచ్‌ పట్టడంతో గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫస్ట్‌డౌన్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి(13; 12 బంతుల్లో 1ఫోర్‌)ను కూడా నోర్జే ఔట్‌ చేశాడు. సుమారు 150 కి.మీ వేగంతో మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ వేసిన బంతికి త్రిపాఠి వద్ద సమాధానం లేకుండా పోయింది. దాంతో 35 పరుగులకే కేకేఆర్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. 

మరో ఏడు పరుగుల వ్యవధిలో దినేశ్‌ కార్తీక్‌(3) నిరాశపరిచాడు. రబడా వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి కార్తీక్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఓపెనర్‌ రాణాకు సునీల్‌ నరైన్‌ జత కలిశాడు. ఈ జోడి క్రీజ్‌లో కుదురుకున్నాక కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు వీరు బ్యాటింగ్‌ కొనసాగించారు. వీరు మెరుపులతో కేకేఆర్‌ 15 ఓవర్లలో 142 పరుగులు చేసింది.  కాగా, నరైన్‌ 32 బంతుల్లో  6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి కేకేఆర్‌ విలువైన పరుగుల్ని అందించాడు. రాణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన 17 ఓవర్‌ నాల్గో బంతికి భారీ షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తరువాత రాణా-మోర్గాన్‌ ద్వయం చెలరేగి ఆడింది. మోర్గాన్‌ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో  17 పరుగులు చేశాడు. స్టోయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి రెండు బంతులకు రాణా, మోర్గాన్‌లు ఔట్‌ కావడంతో రెండొందల పరుగుల మార్కును కేకేఆర్‌ చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబడా, మార్కస్‌ స్టోయినిస్‌లు తలో  రెండు వికెట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement