
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మారనున్నాడా? ఏకంగా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడా? ఇలా అయితే.. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.
హార్దిక్ రాకతోనే గందరగోళం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2012లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్ల తర్వాత కేకేఆర్‌లో చేరాడు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో అతడు సభ్యుడు. అయితే, తగినన్ని అవకాశాలు రాకపోవడంతో 2017లో కోల్‌కతా ఫ్రాంఛైజీని వీడి.. తిరిగి ముంబై గూటికి చేరాడు సూర్య.
అప్పటి నుంచి ముంబై జట్టులో పాతుకుపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అంచెలంచెలుగా ఎదిగాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా సత్తా చాటి.. అనూహ్య రీతిలో టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసి అతడి స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తన సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి.. ముంబై జట్టులో రోహిత్ గైర్హాజరీలో సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తర్వాత అతడే ముంబై పగ్గాలు చేపడతాడని విశ్లేషకులు భావించారు. అంతేకాదు.. మరో సీనియర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ అవకాశం ఉందని అంచనా వేశారు.
అందుకే ముంబైని వీడాలనుకుంటున్నాడా?
అయితే, ముంబై యాజమాన్యం మాత్రం భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌ను చేసింది. ఫలితంగా జట్టు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా రోహిత్ శర్మకు మద్దతుగా బుమ్రా, సూర్య నిలవగా.. హార్దిక్ సీనియర్ల సపోర్టు లేక ఒంటరయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తై కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు.
ఇక హార్దిక్ రాకతో సందిగ్దంలో పడిన సూర్య.. ముంబై జట్టును వీడేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌ను సంప్రదించిందని.. తమ జట్టులోకి వస్తే కెప్టెన్‌గా నియమిస్తామని ఆఫర్ చేసిందని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. సూర్య, శ్రేయస్ అయ్యర్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కేకేఆర్ సారథి అయితే బాగుంటుంది!
సూర్య మళ్లీ కేకేఆర్ గూటికి చేరి కెప్టెన్ అయితే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పదేళ్ల తర్వాత జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయస్‌ను తప్పించడం సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని.. నిరాధార వ్యాఖ్యలను నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. శ్రేయస్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్య పట్ల కేకేఆర్ నిజంగా మొగ్గు చూపితే.. శ్రేయస్ వేలంలోకి వస్తాడని.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కాగా సూర్య ఇప్పటి వరకు ఓవరాల్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 3594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలోనూ 4 శతకాలు బాదిన రికార్డు సూర్యకు ఉంది.
🚨𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐑𝐮𝐦𝐨𝐮𝐫𝐬 🚨👀
KKR management unofficially contacted SKY for KKR captaincy from next year .
( Rohit Juglan from Revzsports)pic.twitter.com/ClEVeuqcb4— KKR Vibe (@KnightsVibe) August 24, 2024