పంజాబ్‌ బ్యాటింగ్‌ వర్సెస్‌ వరుణ్‌ | KKR Won The Toss And Elected To Bat First | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ బ్యాటింగ్‌ వర్సెస్‌ వరుణ్‌

Published Sat, Oct 10 2020 3:06 PM | Last Updated on Sat, Oct 10 2020 3:38 PM

KKR Won The Toss And Elected To Bat First - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ కేకేఆర్‌ ఐదు మ్యాచ్‌లాడి మూడింట గెలవగా, కింగ్స్‌ పంజాబ్‌ ఆరు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా కేకేఆర్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కేకేఆర్‌ అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో పుంజుకుని విజయాల్ని ఖాతాలో వేసుకుంటుండగా, కింగ్స్‌ పంజాబ్‌ పూర్తిగా ఒకరిద్దరిపైనే ఆధారపడుతూ వరుస పరాజయాల్ని చూస్తోంది. ఈ రోజు మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ సమిష్టిగా రాణించకపోతే మరో పరాభవాన్ని చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరగ్గా, అందులో కేకేఆర్‌ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తలోక మార్పు చేసింది.  శివం మావి స్థానంలో ప‍్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి రాగా, కాట్రెల్‌ స్థానంలో జోర్డాన్‌ తీసుకుంది కింగ్స్‌ పంజాబ్‌. శివం మావి చిన్నపాటి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.

పంజాబ్‌ బ్యాటింగ్‌ వర్సెస్‌ వరుణ్‌
కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌లోనే కాస్త బలంగా కనబడుతుండగా, బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతుంది.  యువ స్పిన్నర్‌ రవిబిష్నోయ్‌ ఒక్కడే బౌలింగ్‌లో మెరుగ్గా ఉన్నాడు.అటు కేకేఆర్‌ బౌలింగ్‌ రాటుదేలింది. కింగ్స్‌ పంజాబ్‌కు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, నికోలస్‌ పూరన్‌లు బలమైతే, కేకేఆర్‌ బౌలింగ్‌ నాగర్‌కోటి, కమిన్స్‌, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తిలతో బలంగా ఉంది. రాహుల్‌, అగర్వాల్‌, పూరన్‌లు విఫలమైతే మరొకసారి కేకేఆర్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది. పేస్‌, స్పిన్‌ విభాగంలో కేకేఆర్‌ తిరుగులేకుండా ఉంది. ప్రధానంగా వరుణ్‌ చక్రవర్తి అత్యంత ప్రమాదంగా మారిపోయాడు. గత మ్యాచ్‌ల్లో ఎంఎస్‌ ధోని, ధావన్‌లను వరుణ్‌ చక్రవర్తి బోల్తా కొట్టించిన తీరు కేకేఆర్‌ శిబిరంలో మరింత జోష్‌ను తెచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా వరుణ్‌ చక్రవర్తితో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు ప్రమాదం పొంచి ఉంది.  గతేడాది కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన వరుణ్‌.. ఈసారి కేకేఆర్‌కు కీలకంగా మారిపోయాడు.

ఇక కేకేఆర్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే ఆ జట్టులో నితీష్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్‌, మోర్గాన్‌, రసెల్‌లతో బలంగా ఉంది.  సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌  త్రిపాఠి ఓపెనర్‌గా దిగి విశేషంగా రాణించాడు.  51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో  81 పరుగులు చేశాడు. ఇది ఆ జట్టుకు శుభపరిణామం. కింగ్స్‌ పంజాబ్‌ విషయంలో మాత్రం మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఓపెనర్లు మయాంక్‌, రాహుల్‌ విఫలమైతే ఆ జట్టు తిరిగి తేరుకోలేకపోతుంది. మరి నేటి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఎంతవరకూ రాణిస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement