ప్లేఆఫ్స్‌ రేసు: ఎవరికి ఎంత అవకాశం? | Play Offs Race Wide Open As CSK Beat KKR | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్స్‌ రేసు: ఎవరికి ఎంత అవకాశం?

Published Fri, Oct 30 2020 11:46 AM | Last Updated on Sat, Oct 31 2020 6:33 PM

Play Offs Race Wide Open As CSK Beat KKR - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ నిలిచింది.  ఇక గతేడాది రన్నరప్‌ సీఎస్‌కే.. ఈ ఐపీఎల్‌లో లీగ్‌ దశలో నిష్క్రమించిన తొలి జట్టు. ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా, నిన్న(గురువారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్‌కు చేరింది. ఇక్కడ కేకేఆర్‌ ఓటమి చెందడంతోనే ముంబై నేరుగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మొదటి జట్టుగా నిలిచింది. వారి రన్‌రేట్‌ కూడా అన్ని జట్లు కంటే మెరుగ్గా ఉంది. ముంబై 1.186 రన్‌రేట్‌తో ఉంది.  దాంతో వారు లీగ్‌ దశను టాప్‌-2తో ముగించే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లలతో ఉన్న ముంబైకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ జట్లతో తలపడనుంది. (ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ ఇదే..)

కేకేఆర్‌..
కేకేఆర్‌ ప్లేఆఫ్‌ ఆశలు దాదాపు అడుగు అంటి పోయాయి. కేకేఆర్‌ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లాడి 12 పాయింట్లతో ఉంది. టాప్‌-4లో నిలవడానికి కేకేఆర్‌కు పాయింట్ల పరంగా అవకాశం ఉన్నా నెట్‌రన్‌ రేట్‌ వారి బెర్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం​ రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్‌ రేసులో ఉంటుంది. ప్రస్తుతం కేకేఆర్‌ నెట్‌రన్‌ రేట్‌ -0.467గా ఉంది. ఒకవేళ తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచి 14 పాయింట్లతో నిలిచినా వారిపై నెట్‌రన్‌రేట్‌ ప్రభావం చూపనుంది. లీగ్‌ దశలో కేకేఆర్‌కు ఒక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది.

కింగ్స్‌ పంజాబ్‌
ఈ సీజన్‌ ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో చతికిలబడి ఒక్కసారి రేసులో వచ్చిన జట్టు ఏదైనా ఉందంటే అది కింగ్స్‌ పంజాబ్‌. తొలి అంచెలో విజయానికి చాలా దగ్గరగా వచ్చి పలు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కింగ్స్‌ పంజాబ్‌.. రెండో అంచెలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. మొత్తంగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు రన్‌రేట్‌ -0.049గా ఉంది. ఆ జట్టు ఇంకా రాజస్తాన్‌ రాయల్స్‌తో, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్‌ పంజాబ్‌ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది.  కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్‌ పంజాబ్‌ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్‌ కంటే కింగ్స్‌ పంజాబ్‌ రన్‌రేట్‌ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్‌ పంజాబ్‌ రన్‌రేట్‌ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. 

రాజస్తాన్‌ రాయల్స్‌
ఈ సీజన్‌ ఆరంభంలో అదరగొట్టి ఆపై అంచనాలను అందుకోలేకపోయిన జట్టు రాజస్తాన్‌. ప్రస్తుతం 12 మ్యాచ్‌లో ఆడి 10 పాయింట్లతో ఉంది రాజస్తాన్‌. ఇంకా కింగ్స్‌ పంజాబ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆ జట్టు ఆడాల్సి ఉంది. కానీ వారి నెట్‌రన్‌రేట్‌ చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం రాజస్తాన్‌ రన్‌రేట్‌ -0.505గా ఉంది. రాజస్తాన్‌ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రన్‌రేట్‌పై ఆధారపడక తప్పదు. అదే సమయంలో కింగ్స్‌ పంజాబ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓడించడమే కాకుండా సన్‌రైజర్స్‌ ఆడాల్సి ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో ఓడితేనే రాజస్తాన్‌కు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.

ఆర్సీబీ
అందరి అంచనాలను తల్లక్రిందలు చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లో ఆడిన ఆర్సీబీ.. 14 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి అండ్‌ గ్యాంగ్‌.. ఇంకా సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. వారి రన్‌రేట్‌ 0.048తో మెరుగ్గా ఉంది. ఇక మిగిలి ఉన్న మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌ గెలిచినా ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీకి నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువ. కానీ అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూసుకోవాలి. భారీ ఓటములు ఎదురైతే మాత్రం అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూపనుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌
ఆరంభంలో ఇరగదీసిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. ముందుగా ఢిల్లీని ప్లేఆఫ్‌ చేరుతుందని భావించారు. కానీ ఇంకా ఢిల్లీ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకోలేదు. ప్రస్తుతం 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. 14 పాయింట్లతో ఉంది. వారి రన్‌రేట్‌గా కూడా మెరుగ్గానే ఉంది. ఢిల్లీ రన్‌రేట్‌ 0.030గా ఉండటంతో ఆ జట్టు టాప్‌-4లో ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకోవడమే కాకుండా రేసులో ఉన్న జట్లు భారీ తేడాతో గెలవకుండా ఉంంది. ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరహా ఓటములు వస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్‌ బెర్తు కష్టం అవుతుంది. ముంబై ఇండియన్స్‌, రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లతో ఢిల్లీ తన మిగిలిన లీగ్‌ మ్యాచ్‌ల్లో తలపడనుంది. ప్రస్తుతానికి ఢిల్లీ సేఫ్‌జోన్‌లో ఉన్నట్లే.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
ఈ సీజన్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ ఆశలు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన వార్నర్‌ సేన 10 పాయింట్లతో ఉంది. అంటే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో ఆర్సీబీ, ఢిల్లీ, కింగ్స్‌ పంజాబ్‌ జట్లలో కనీసం ఒక జట్టు 16 పాయింట్లతో ఉండకూడదు. అప్పుడు సన్‌రైజర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రన్‌రేట్‌ 0.396గా ఉంది. అంటే కింగ్స్‌ పంజాబ్‌ కంటే మెరుగ్గా ఉంది సన్‌రైజర్స్‌. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల కంటే సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌ బాగుండటం వారికి సానుకూలాంశం. ఇది నిలబడాలంటే మిగిలిని రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తీరాలి. సన్‌రైజర్స్‌ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌లతో తలపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement