న్యూఢిల్లీ: తెలుగు క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్తే! భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్, విశాఖపట్నంలలో ఇంగ్లండ్ జట్టుతో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ టాపార్డర్ బ్యాటర్ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. భారత పర్యటన కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ టూర్‌లో బెన్ స్టోక్స్ బృందం ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టును, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టును ఆడుతుంది. సీనియర్ స్టార్లంతా ఉంటారని తెలుగు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు.
అయితే అనూహ్యంగా కోహ్లి ఈ రెండు మ్యాచ్‌లకు గైర్హాజరు కానున్నాడు. ‘కోహ్లి కోరిక మేరకే ఆడటం లేదు. ఈ మేరకు బోర్డుతో ముందుగానే అనుమతి తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో ఈ విషయమై మాట్లాడాడు. టీమ్ మేనేజ్‌మెంట్‌తోనూ కోహ్లి చర్చించాడు. అతను లేకపోవడం జట్టుకు ఇబ్బందికరమే అయితే వ్యక్తిగత కారణాల వల్లే దూరమవుతున్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
అతని నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని, అతనికి మద్దతుగా నిలుస్తుందని జై షా చెప్పారు. అఫ్గానిస్తాన్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లోనూ కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ అంతర్గత జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకొని లండన్ వెళ్లొచ్చాడు.
టెస్టులకు సంబంధించి 2021లో విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడి తర్వాతి మూడు టెస్టులకు గైర్హాజరయ్యాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రసవం కోసం అతనుస్వదేశానికి వచ్చాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్ కోసం కోహ్లి స్థానాన్ని రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment