న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడు అనుకోలేదని భారత స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో 48వ సెంచరీతో భారత గ్రేటెస్ట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ (49) సరసన నిలిచేందుకు చేరువైన కోహ్లి తన తారాస్థాయి బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందిస్తూ... ‘క్రికెట్ గురించే మాట్లాడితే... ఇంతలా రాణిస్తానని, ఇన్ని మైలురాళ్లు అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోనే లేదు.
దేవుడి కృప వల్లే ఎక్కడో ఉన్న నేను ఇక్కడిదాకా వచ్చాను. నా ఆటతీరు, నిలకడ కొనసాగుతున్నాయి. సెంచరీలు చేయాలని, వేల కొద్దీ పరుగులు సాధించాలని కలలైతే కనేవాణ్ని. కానీ అవన్నీ ఇలా ఒక్కొక్కటిగా సాకారమవుతాయని అనుకోలేదు. నిజం చెప్పాలంటే క్రికెట్‌లో ఇవి ఇలా జరుగుతాయని, పయనం ఇలా సాగుతుందని ఎవరూ ప్రణాళికలు వేసుకోరు’ అని అన్నాడు.
ఈ 12 ఏళ్లలో టన్నుల కొద్దీ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఒక దశలో తన ప్రొఫెషనల్ క్రికెట్‌లోని లోపాల్ని గుర్తించడం... వెంటనే ఆటకు తగిన జీవనశైలి, క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్లే అంతా మంచి జరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘నా దృష్టంతా జట్టుపైనే ఉంటుంది. టీమిండియా విజయాల కోసం నా ప్రదర్శన బాగుండాలని, క్లిష్ట సమయంలోనూ జట్టును గట్టెక్కించాలన్నదే నా లక్ష్యం.
అందుకే జీవనశైలి (సంపూర్ణ ఫిట్‌నెస్ కోసం)ని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ తప్పదని భావించాను. ఆట ఎప్పుడు మన కృషినే గుర్తిస్తుంది. నిజాయితీగా చెబుతున్నా... నా కెరీర్‌లో నేను బాగా నేర్చుకుంది ఇదే! ఫీల్డులో వంద శాతం అంకితభావంతో ఆడేందుకే కృషి చేస్తా. ఇదంతా కూడా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తా’ అని కోహ్లి వివరించాడు.
2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ కింగ్... సచిన్ తర్వాత అంతటి క్రేజ్‌ను సంపాదించుకోవడమే కాదు... ఆ మాస్టర్ బ్లాస్టర్ వేర్వేరు ఘనతలను తిరగరాశాడు. ఈ ప్రపంచకప్‌లో ఒక శతకం, మూడు అర్ధసెంచరీలతో అతను ఇప్పటికే 354 పరుగులు చేశాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నవంబర్ 5న కోహ్లి పుట్టినరోజు. అదే రోజు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉండటంతో శతకోటి భారతీయులంతా ఆ రోజు కింగ్ కోహ్లి శతకం కొట్టాలని కోరుకుంటున్నారు.
మరో వైపు కోహ్లి కోసం ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు ఐసీసీ అనుమతితో అందరి ముందు భారీ కేక్‌ను కట్ చేయించాలనేది ప్రతిపాదన. దీంతో పాటు మైదానానికి వచ్చే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులకు లోపలికి వెళ్లే సమయంలో ‘కోహ్లి మాస్‌్క’లను అందజేస్తారు. దాంతో స్టేడియమంతా కోహ్లిమయమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment