బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరోసారి కలిసొచ్చిం ది. నాలుగు వరుస పరాజయాలతో డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిం ది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిన కోల్‌కతా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన గత 11 మ్యాచ్‌ల్లో ఏడుసార్లు నెగ్గిన కోల్‌కతా ఈసారీ తమ ఆధిపత్యాన్ని చాటుకొని 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు సాధించింది. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టారు. చివర్లో రింకూ సింగ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వీస్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరిశారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది.
డుప్లెసిస్ (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (5; 1 ఫోర్) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కోహ్లి (37 బంతుల్లో 54; 6 ఫోర్లు), మహిపాల్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి (3/27), సుయశ్ శర్మ (2/30), రసెల్ (2/29) బెంగళూరును దెబ్బ కొట్టారు.
ధనాధన్ ఆరంభం...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు జేసన్ రాయ్, జగదీశన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్.. షహబాజ్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్‌లతో అలరించాడు. తొమ్మిది ఓవర్లకు 82/0తో దూసుకుపోతున్న కోల్‌కతాకు వైశాక్ బ్రేక్ వేశాడు. పదో ఓవర్లో జగదీశన్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), జేసన్ రాయ్‌లను వైశాక్ అవుట్ చేశాడు.
రెండు క్యాచ్‌లు వదిలేసి...
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా కోల్‌కతా అదే దూకుడు కొనసాగించింది. కోల్‌కతాకు బెంగళూరు ఫీల్డర్ల నిర్లక్ష్యం కూడా కలిసొచ్చిం ది. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 5 వద్ద సిరాజ్.. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 19 వద్ద హర్షల్ పటేల్ క్యాచ్‌లు జారవిడిచారు. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రాణా కదంతొక్కాడు. హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్‌లోని చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచిన రాణా... వైశాక్ వేసిన 17వ ఓవర్‌లోని చివరి మూడు బంతుల్లో 4,4,6తో మెరిశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 167/2తో నిలిచింది. అయితే 18వ ఓవర్లో హసరంగ స్పిన్‌కు నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు) పెవిలియన్ చేరారు. ఈ ఓవర్లో హసరంగ 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రింకూ సింగ్ 6,4,4 కొట్టగా... ఐదో బంతికి రసెల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వీస్ రెండు సిక్స్‌లు కొట్టడంతో కోల్‌కతా స్కోరు 200కు చేరింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) వైశాక్ 56; జగదీశన్ (సి) విల్లీ (బి) వైశాక్ 27; వెంకటేశ్ అయ్యర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హసరంగ 31; నితీశ్ రాణా (సి) వైశాక్ (బి) హసరంగ 48; రసెల్ (బి) సిరాజ్ 1; రింకూ సింగ్ (నాటౌట్) 18; డేవిడ్ వీస్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–83, 2–88, 3–168, 4–169, 5–185. బౌలింగ్: సిరాజ్ 4–0–33–1, విల్లీ 3–0–31–0, హసరంగ 4–0–24–2, షహబాజ్ అహ్మద్ 1–0–25–0, వైశాక్ 4–0–41–2, హర్షల్ పటేల్ 4–0–44–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) రసెల్ 54; డుప్లెసిస్ (సి) రింకూ సింగ్ (బి) సుయశ్ శర్మ 17; షహబాజ్ అహ్మద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుయశ్ శర్మ 2; మ్యాక్స్‌వెల్ (సి) నితీశ్ రాణా (బి) వరుణ్ 5; మహిపాల్ (సి) రసెల్ (బి) వరుణ్ 34; దినేశ్ కార్తీక్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 22; ప్రభుదేశాయ్ (రనౌట్) 10; హసరంగ (సి) అనుకూల్ రాయ్ (సబ్) (బి) రసెల్ 5; విల్లీ (నాటౌట్) 11; వైశాక్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–31, 2–51, 3–58, 4–113, 5–115, 6–137, 7–152, 8–154. బౌలింగ్: వైభవ్ అరోరా 2–0–22–0, ఉమేశ్ యాదవ్ 1–0–19–0, సుయశ్ శర్మ 4–0–30–2, వరుణ్ చక్రవర్తి 4–0–27–3, రసెల్ 4–0–29–2, సునీల్ నరైన్ 4–0–41–0, నితీశ్ రాణా 1–0–8–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment