న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. కుసాల్‌, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్‌ | Kusal Mendis, Avishka Fernando Hammer Twin Tons In SL Vs NZ 1st ODI | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. కుసాల్‌, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్‌

Published Wed, Nov 13 2024 7:40 PM | Last Updated on Wed, Nov 13 2024 7:46 PM

Kusal Mendis, Avishka Fernando Hammer Twin Tons In SL Vs NZ 1st ODI

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 13) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుసాల్‌ మెండిస్‌ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్‌ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం​ అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్‌పై 300 ప్లస్‌ స్కోర్‌ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుసాల్‌ మెండిస్‌, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్‌తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో సనత్‌ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (12) వికెట్‌ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్‌ మెండిస్‌, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్‌ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. జనిత్‌ లియనాగే క్రీజ్‌లో ఉన్నాడు.

కివీస్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఐష్‌ సోధి తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement