CWC 2023: న్యూజిలాండ్‌ జట్టులో కీలక పరిణామం.. స్టార్‌ బౌలర్‌కు పిలుపు | ICC ODI WC 2023: Kyle Jamieson Has Been Added To New Zealand World Cup Squad As Matt Henry Cover Up Injury Concern - Sakshi
Sakshi News home page

CWC 2023: న్యూజిలాండ్‌ జట్టులో కీలక పరిణామం.. స్టార్‌ బౌలర్‌కు పిలుపు

Published Thu, Nov 2 2023 11:16 AM | Last Updated on Thu, Nov 2 2023 12:09 PM

Kyle Jamieson Has Been Added To New Zealand World Cup Squad As Matt Henry Cover Up - Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడిన మ్యాట్‌ హెన్రీకి కవర్‌ అప్‌గా స్టార్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ను ప్రకటించింది న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు. ఇవాళ సాయంత్రానికంతా జేమీసన్‌ బెంగళూరుకు చేరుకుంటాడు. ఈ శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌ కోసం కివీస్‌ జట్టు కూడా ఇవాళ బెంగళూరుకు చేరుకుంటుంది.

ప్రపంచకప్‌కు ముందు కివీస్‌ బోర్డు జేమీసన్‌ను టిమ్‌ సౌథీకి కవర్‌ అప్‌గా ప్రకటించింది. అయితే సోథీ వేగంగా కోలుకోవడంతో జేమీసన్‌ స్వదేశంలోనే ఉండిపోయాడు. తాజాగా మ్యాట్‌ హెన్రీ గాయం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ బోర్డు జేమీసన్‌ను భారత్‌కు పిలిపించింది. కివీస్‌ తదుపరి ఆడే మ్యాచ్‌లో హెన్రీ స్థానంలో జేమీసన్‌ తుది జట్టులో ఆడే అవకాశం​ ఉంది.  

కాగా, నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మ్యాట్‌ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీకి గురై ఓవర్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. హెన్రీ తదనంతరం జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీంతో కివీస్‌ బోర్డు హుటాహుటిన జేమీసన్‌ను భారత్‌కు రావాల్సిందిగా కబురుపెట్టింది. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ ఒక్కసారిగా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్‌ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్‌ రన్‌రేట్‌ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది.

నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (114), డస్సెన్‌ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. కేశవ్‌ మహారాజ్‌ (4/46), మార్కో జన్సెన్‌ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (60), విల్‌ యంగ్‌ (33), డారిల్‌ మిచెల్‌ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement