ఆస్ట్రేలియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ స్కై ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీస్ స్కూప్ షాట్ ఆడాడు. లబూషేన్ ఈ షాట్‌ను అచ్చుగుద్దినట్లు సూర్యకుమార్ యాదవ్‌లా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
😱 MARNUS 😱
That's some shot at The Gabba! #BBL14 pic.twitter.com/VTTdEULcEy— KFC Big Bash League (@BBL) January 16, 2025
ఎప్పుడూ క్లాసీ షాట్లు ఆడే లబూషేన్ విన్నూత్నమైన షాట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లబూషేన్ 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో లబూషేన్‌కు ఇదే అత్యధిక స్కోర్.
లబూషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మ్యాట్ రెన్‌షా (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అల్సోప్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. నాథన్ మెక్‌స్వీని (1), మ్యాక్స్ బ్రయాంట్ (4) విఫలమయ్యారు.
లబూషేన్ ధాటికి హరికేన్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రిలే మెరిడిత్‌కు లబూషేన్ చుక్కలు చూపించాడు. లబూషేన్ స్కై తరహా సూపర్ సిక్సర్‌ను మెరిడిత్ బౌలింగ్‌లోనే బాదాడు. మెరిడిత్ తన కోటా నాలుగు ఓవర్లలో వికెట్లు ఏమీ తీసుకోకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. హరికేన్స్ కెప్టెన్ నాథన్ ఇల్లిస్ మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ.. 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. మార్కస్ బీన్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ పడగొట్టారు.
202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ ధాటికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ జట్టు 8.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ఓవెన్ 20 బంతుల్లో బౌండరీ, అర డజను సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ కాలెబ్ జువెల్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. కాలెబ్ 24 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. చార్లీ వకీం డకౌట్ కాగా.. కాలెబ్‌కు జతగా నిఖిల్ చౌదరీ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ నెగ్గాలంటే 70 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment