బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్య సేన్
పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు
పారిస్: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ఒలింపిక్స్ పతక ఆశలను సజీవంగా నిలిపాడు. అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న లక్ష్య సెమీఫైనల్లోకి అడుగు పెట్టి పతకంపై గురి పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–15, 21–12 స్కోరుతో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు.
75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా... ఆ తర్వాత సత్తా చాటిన 23 ఏళ్ల లక్ష్య సెమీస్ చేరాడు. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున సెమీఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా సేన్ ఘనత సృష్టించాడు. గతంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ (2012), కిడాంబి శ్రీకాంత్ (2016) క్వార్టర్ ఫైనల్ వరకు మాత్రమే రాగలిగారు.
లో కీన్ యె (సింగపూర్), అక్సెల్‌సన్ (డెన్మార్క్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. సెమీస్‌లో లక్ష్య గెలిస్తే అతనికి స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడినా కాంస్య పత కం కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంటుంది.
2021 వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యపతక విజేత అయిన లక్ష్య క్వార్టర్స్‌లో తొలి గేమ్‌లో కూడా పోరాడాడు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన టిన్ చెన్ 11–9తో ముందంజ వేసి ఆపై 14–9తో నిలిచాడు. అయితే కోలుకున్న లక్ష్య వరుస పాయింట్లతో 16–15కు దూసుకెళ్లాడు. స్కోరు 19–19కి చేరగా, చివరకు గేమ్ తైపీ ఆటగాడిదే అయింది. రెండో గేమ్ కూడా పోటాపోటీగా సాగగా సేన్ 11–10తో ఆధిక్యంలో నిలిచాడు.
స్కోరు 13–13కి చేరిన తర్వాత 10 పాయింట్లలో 8 గెలుచుకొని గేమ్ సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌కు వచ్చే సరికి లక్ష్య ఆటతో మరింత జోరు పెరిగింది. విరామ సమయానికి 11–7 వద్ద ఉన్న సేన్ ఆ తర్వాత దూసుకుపోయాడు. వరుస స్మాష్‌లతో దూకుడు కనబర్చడంతో టిన్ చెన్ వద్ద సమాధానం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment