
IPL 2023- Matheesa Pathirana- CSK: మతీశ పతిరణ.. ‘బేబీ మలింగ’గా పేరొందిన ఈ శ్రీలంక బౌలర్.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనడంలో సందేహం లేదు. తన వైవిధ్యమైన టెక్నిక్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టే 20 ఏళ్ల పతిరణ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు.
ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలు ఇచ్చిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలను.. లంక మాజీ స్టార్ లసిత్ మలింగ ఖండించగా.. మరో లంక పేసర్ చమిందా వాస్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
టెస్టులు ఆడొద్దు
బేబీ మలింగ గురించి ధోని మాట్లాడుతూ.. పతిరణ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలని.. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. వన్డేలు, టీ20లకు మాత్రమే లంక అతడి సేవలను ఉపయోగించుకోవాలని సూచన చేశాడు. గాయాల బారిన పడితే కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ధోని వ్యాఖ్యలు ఖండించిన మలింగ
అయితే, మలింగ మాత్రం ఈ విషయంలో ధోనిని వ్యతిరేకించాడు. గాయాలకు భయపడి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. సంప్రదాయ క్రికెట్ ఆడితేనే టెక్నిక్ మెరుగుపడుతుందని పేర్కొన్నాడు. తాను కూడా టెస్టులు ఆడిన వాడినేనని.. ధోని గనుక సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి ఆమోదనీయం కాదంటూ ఖండించాడు.
కానీ, చమింద వాస్ మాత్రం ధోని వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. ‘‘పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అతడి లాంటి వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్ కలిగిన బౌలర్ ఒకవేళ అన్ని ఫార్మాట్లలో ఆడితే ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే పెద్దగా భారం పడదు. అంతకంటే ఎక్కువసేపు రోజుల తరబడి బౌల్ చేయాలంటే సమస్యలు తప్పవు. ధోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..!