లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు.
నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment