
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మేటి బ్యాటర్ మిథాలీ రాజ్. అంతర్జాతీయ స్థాయిలో తన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సారథి. క్రికెట్ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టిన ఈ దిగ్గజ ప్లేయర్.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.
అయితే, అందరు ఆడపిల్లలాగే తనకు కూడా సమాజం నుంచి వివాహం విషయంలో ఎదురైన ఇబ్బందులు, అబ్బాయిల ఆలోచనా విధానం గురించి మిథాలీ రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్‌వీర్ అల్హాబాదియా షోలో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ, పిన్ని పదే పదే పెళ్లి గురించి ప్రస్తావించేవారు. అందుకే కొన్నిసార్లు వాళ్ల మాటలు విని.. అబ్బాయి(పెళ్లి కొడుకు)లతో మాట్లాడేందుకు సిద్ధమయ్యాను.
అందులో చాలా మంది.. ఎంత మంది పిల్లల్ని కనాలి?! వారి ఆలనాపాలనా చూసుకునేందుకు ఇంట్లోనే ఉంటావా? ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. పెళ్లి తర్వాత క్రికెట్ వదిలేయాలనేది వారి ఉద్దేశం. ఇవన్నీ నా ఊహకు కూడా అందని విషయాలు. అంతకుముందు ఎప్పుడూ ఎవరితో నేను ఇలాంటివి చర్చించనూ కూడా లేదు.
మా అమ్మను చూసుకుంటావా? లేదంటే..
నా ధ్యాస ఎల్లప్పుడూ క్రికెట్ మీదే. అప్పట్లో నేను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతడు నన్ను ఓ వింత ప్రశ్న అడిగాడు. ‘పెళ్లైన తర్వాత నువ్వు మా అమ్మను చూసుకుంటావా? లేదంటే క్రికెట్ ఆడటానికి వెళ్తావా?’ అన్నాడు. అందుకు నేను వెంటనే.. ‘ఇదేం ప్రశ్న’ అన్నాడు.
అతడు బదులిస్తూ.. ‘ఒకవేళ మా అమ్మకు ఏదైనా జరిగితే నువ్వు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? లేదంటే ఆ కోసం వెళ్తావా? రెండింటిలో నీకు ఏది అత్యంత ముఖ్యమైనదో తెలుసుకోవాలనుకుంటున్నా’ అన్నాడు. ‘పరిస్థితిని బట్టి నా ప్రవర్తన ఉంటుంది’ అని నేను సమాధానమిచ్చాను.
కొన్నిసార్లు జీవితంలో అడ్జస్ట్ అవ్వాలని..
క్రికెటర్లలో నా ఫ్రెండ్ ఒకరు కూడా ఇదే మాట అన్నారు. కొన్నిసార్లు జీవితంలో అడ్జస్ట్ అవకతప్పదని.. ఎదుటి వ్యక్తికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సాధారణంగా మగవాళ్లంతా ఇలాంటి ప్రశ్నలే అడుగుతారని.. పెళ్లి తర్వాత పిల్లలు, ఇల్లు చూసుకోవడమే మన మొదటి ప్రాధాన్యం అయి ఉండాలని కోరుకుంటారని చెప్పింది.
అలాంటి వాడి కోసం నేనెందుకు మారాలి?
కానీ మనసులో మాత్రం ఒకటే మెదిలింది. క్రికెటర్‌ను అయ్యే క్రమంలో నా తల్లిదండ్రులు, నేను ఎన్నో త్యాగాలు చేశాం. కానీ ఎవరో ఒక వ్యక్తి.. అది కూడా నా కెరీర్‌ను వదిలేసి.. ఇంటిని చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావాలనే వ్యక్తి.. అలాంటి వాడి కోసం నేనెందుకు ఆటను వదిలేయాలని గట్టిగా అనుకున్నాను’’ అని మిథాలీ రాజ్ తన మనసులోని భావాలను పంచుకుంది.
సింగిల్‌గానే సంతోషంగా ఉన్నా
మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యుక్త వయసులో ఉన్నపుడు పెళ్లి సంబంధాలు ఎక్కువగా వచ్చేవని.. ఇప్పట్లో మాత్రం తనకు అలాంటి ఆలోచనలేవీ లేవని మిథాలీ రాజ్ చెప్పుకొచ్చింది. పెళ్లైన వాళ్లను చూస్తూ ఉంటే.. తానిలా సింగిల్‌గా ఉండటమే మంచిదనే భావన బలపడుతోందని నవ్వులు చిందించింది 42 ఏళ్ల మిథాలీ రాజ్. అన్నట్లు చెప్పలేదు కదూ నేడు ఈ లెజెండరీ క్రికెటర్ పుట్టినరోజు(డిసెంబరు 3). హ్యాపీ బర్త్‌డే క్రికెట్ క్వీన్!
Comments
Please login to add a commentAdd a comment