టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే అతడిని మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజ ఆటగాడితో పోల్చకూడదని సరికాదన్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. అయితే, రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు.
టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని విభిన్నమైన ఆటగాడు.
ధ్రువ్ జురెల్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే, ఇప్పుడే అతడిని ధోనితో పోల్చడం సరికాదు. అతడిని స్వేచ్ఛగా ఆడనిస్తే మంచిది.
ధోని ఎంఎస్ ధోని అనే బ్రాండ్ సంపాదించుకోవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం సానుకూల అంశం.
అంతేకాదు.. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం అతడి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం’’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావన రాగా.. అతడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల క్రికెటర్ అని గంగూలీ కితాబులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment