మైదానంలోనే కుప్పకూలాడు.. 18 ఏళ్లకే | List Of Major Incidents Happened For Sports Persons | Sakshi
Sakshi News home page

క్రీడాలోకంలో ఎన్నెన్నో విషాదాలు

Published Wed, Feb 24 2021 4:37 PM | Last Updated on Thu, Feb 25 2021 12:56 PM

List Of Major Incidents Happened For Sports Persons - Sakshi

వాషింగ్టన్‌: కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ వుడ్స్(45)‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టైగర్‌ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో ఆయనను ఆస్పత్రికి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, కుడి కాలులో రాడ్డు వేసినట్లు తెలిపారు. కాగా లాస్‌ ఏంజెల్స్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టైగర్‌ వుడ్స్‌ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లింది. 

ఈ క్రమంలో ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టైగర్‌ ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరికొంత మంది గతేడాది హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన కోబీ బ్రియాంట్‌ సహా అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిన క్రీడాకారులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. 

పద్దెనిమిదేళ్లకే మృత్యువాత పడ్డాడు
ధ్రువ్‌ మహేందర్‌ పండోవ్‌.. పంజాబ్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. 1974 జనవరి 9న జన్మించిన అతడు పదమూడేళ్ల వయస్సులోనే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జమ్ము కశ్మీర్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులు చేసిన ధ్రువ్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 14 ఏళ్ల 294 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

అంతేగాక రంజీ ట్రోఫీలో 1000 పరుగుల మార్కును చేరుకున్న పిన్న వయస్కుల్లో(17 ఏళ్ల 341 రోజులు) ఒకడిగా కూడా నిలిచాడు. మెరుగైన భవిష్యత్తు గల ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న ధ్రువ్‌ దురదృష్టవశాత్తూ అంబాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పద్దెమినిదేళ్ల వయసులో(1992, జనవరి 31)నే ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు.  

మైదానంలో కుప్పకూలాడు
భారత్‌ తరఫున  4 టెస్టు మ్యాచ్‌లు, 32 వన్డేలు ఆడాడు క్రికెటర్‌ రమణ్‌ లంబా కుశాల్‌. 1960లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన అతడు, ఐర్లాండ్‌ తరఫున అనధికారంగా వన్డే మ్యాచుల్లో పాల్గొన్నాడు. అంతేగాకుండా బంగ్లాదేశ్‌ ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆడాడు. ఈ క్రమంలో 1998 ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో భాగంగా క్రికెట్‌ బాల్‌ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగడంతో కోమాలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. 

కూతురితో పాటు తాను కూడా
బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబీ బ్రియాంట్‌ గతేడాది తన అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. కూతురు జియానాను సైతం తనలాగే అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్‌ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌ ఉండటంతో అందులో పాల్గొనడానికి  తనతో పాటు హెలికాప్టర్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారితో పాటు మరో ఏడుగురు కూడా మరణించారు.

ఏడేళ్లపాటు జీవచ్చవంలా
ఫార్ములా వన్‌ మాజీ ప్రపంచ చాంపియన్‌ మైకెల్‌ షుమాకర్‌ స్కై డైవింగ్‌ సరదాతో చావు అంచుల దాకా వెళ్లాడు. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల్లో  షుమేకర్‌ స్కీయింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైన అతడు సుదీర్ఘకాలంపాటు కోమాలోనే ఉన్నాడు. 1946లో తొలిసారిగా ఆరంభమైన ఫార్ములా వన్ నాటి నుంచీ అంతకు ముందెన్నడు లేనివిధంగా, ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లతో పాటు పందేలనూ  గెలుచుకున్న షూమాకర్.. 2004లో చివరిసారిగా  తన చివరి ఫార్ములా రేస్‌ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం అతడు కోమా నుంచి బయపడినప్పటికీ మునుపటిలా సాధారణ జీవితం గడిపే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.

విషాదాంతంగా ముగిసిన హ్యూస్‌ జీవితం
క్రికెట్‌ను ప్రాణంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిఫ్‌ జోయెల్‌ హ్యూస్‌ జీవితం ఆట కారణంగానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. 2014 నవంబర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ సంధించిన బౌన్సర్‌ హ్యూస్‌ తలకు బలంగా తాకింది. బాధతో విలవిల్లాడుతూ క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్‌ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. పాతికేళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. వీరితో పాటు క్రీడా రంగానికి చెందిన మరెంతో మంది ఆటగాళ్లు హఠాన్మరణం చెంది అభిమానులకు దుఃఖాన్ని మిగిల్చారు.

చదవండి:
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్‌ వుడ్స్‌కు తీవ్ర గాయాలు

మొతేరా క్రికెట్‌ స్టేడియం : బిగ్‌ సర్‌ప్రైజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement