
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.