Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా? | Lost 16 Matches In A Row Iceland Cricket Jibe At Pakistan Hafeez Viral | Sakshi
Sakshi News home page

Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా?

Published Sat, Dec 30 2023 9:37 PM | Last Updated on Sat, Dec 30 2023 9:38 PM

Lost 16 Matches In A Row Iceland Cricket Jibe At Pakistan Hafeez Viral - Sakshi

మహ్మద్‌ హఫీజ్‌ (PC: PCB)

పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ హఫీజ్‌పై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియా ఇకపై తన అదృష్టాన్ని కాలదన్నుకుని పాక్‌కు గెలిచే అవకాశం ఇస్తుందేమో అంటూ అతడిని దారుణంగా ట్రోల్‌ చేసింది.

కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌ వరుసగా రెండింట ఓడింది. దీంతో సిరీస్‌ 2-0 తేడాతో ఆతిథ్య జట్టు కైవసం అయింది. అయితే, తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్‌.. రెండో టెస్టులో మెరుగ్గానే ఆడింది. కానీ.. కీలక సమయంలో ఫీల్డింగ్‌ తప్పిదాలు, బ్యాటింగ్‌ వైఫల్యాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అవుట్‌ కావడంతో పాక్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్యాట్‌ కమిన్స్‌ విసిరిన బంతి రిజ్వాన్‌ రిస్ట్‌బ్యాండ్‌ను తాకి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడినట్లు కనిపించగా.. అప్పీలు చేశాడు. అయితే, ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో.. ఆసీస్‌ రివ్యూకు వెళ్లగా థర్డ్‌ అంపైర్‌ రిజ్వాన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో రిజ్వాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.

ఈ నేపథ్యంలో.. ఓటమి అనంతరం మహ్మద్‌ హఫీజ్‌ స్పందిస్తూ.. తమ జట్టు గొప్పగా ఆడినా.. సాంకేతిక లోపాలు, అంపైరింగ్‌ తప్పిదాల వల్లే ఓడిపోయిందని ఆసీస్‌ ఆట తీరును విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి కమిన్స్‌ ఇప్పటికే అతడికి కౌంటర్‌ ఇచ్చాడు.

ఆఖరి వరకు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుందని హఫీజ్‌ వ్యాఖ్యలకు బదులిచ్చాడు. తాజాగా ఐస్‌లాండ్‌ క్రికెట్‌ సైతం.. ‘‘నిజంగా ఇదొక అద్భుతం. అత్యంత ప్రతిభావంతమైన, సుపీరియర్‌ టాలెంట్‌ ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా 16 టెస్టులు ఎలా ఓడిపోయింది? 

ఇక నుంచి ఆస్ట్రేలియా జట్టు తాము అదృష్టవంతులుగా ఉండటం ఆపేస్తే బాగుంటుంది’’ అంటూ మహ్మద్‌ హఫీజ్‌ను ట్రోల్‌ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో పాకిస్తాన్‌ ఇప్పటి వరకు వరుసగా పదహారు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్‌ గడ్డపై ఇంత వరకు ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement