భారత అథ్లెట్‌ నందినిపై విషం చిమ్మిన స్వప్నా.. ట్రాన్స్‌జెండర్‌ అంటూ తీవ్ర ఆరోపణలు | Indias Swapna Barman Alleges Lost My Medal To Transgender After Nandini Bronze Medal Win, Later Deleted Her Post - Sakshi
Sakshi News home page

నందిని అగసారపై విషం చిమ్మిన భారత అథ్లెట్‌.. ట్రాన్స్‌జెండర్‌ అంటూ తీవ్ర ఆరోపణలు! ఆ పతకం నాకు ఇప్పించండి..

Published Mon, Oct 2 2023 1:38 PM | Last Updated on Mon, Oct 2 2023 5:35 PM

Lost My Medal To Transgender: Alleges Indias Swapna Barman Then Deletes Post Viral - Sakshi

భారత అథ్లెట్‌ స్వప్నా బర్మన్‌ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్‌ చేసింది.

ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్‌పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్‌ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్‌ మెడల్‌ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది.

అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్‌ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్‌లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది.

‘‘చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడల్లో భాగంగా నేను నా కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్‌జెండర్‌ వుమెన్‌కు చేజార్చుకున్నాను. నా మెడల్‌ నాకు కావాలి. నాకు ఎవరైనా సాయం చేయండి. అథ్లెటిక్స్‌లో ఇలాంటి వాళ్లు పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధం’’ అంటూ ఆమె ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, వెంటనే ఆ పోస్ట్‌ను స్వప్నా డిలీట్‌ చేసినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారాయి. కాగా స్వప్నా బర్మన్‌ అధికారిక ఖాతా నుంచి పోస్ట్‌ వచ్చిందా లేదంటే ఆమె అకౌంట్ నుంచి వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా నందినిపై ఆరోపణలు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ రెగ్యులేషన్స్‌ రూల్స్‌ ప్రకారం.. ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లు మహిళా​ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కాగా స్వప్నా ఇటీవల బ్రిడ్జ్‌తో మాట్లాడుతూ.. ‘‘టెస్టోస్టిరాన్‌ లెవల్స్‌ 2.5 కంటే ఎక్కువగా ఉన్నవాళ్లు 200 మీ. మించి ఏ ఇతర ఈవెంట్లలో పాల్గొనకూడదు.

ఏ అమ్మాయైనా సరే.. త్వరగా హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌ను పూర్తి చేయలేదు. నేనైతే 13 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఆమె నాలుగు నెలల శిక్షణలోనే ఈ స్థాయికి ఎలా చేరుకుందో’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

100 మీటర్ల హర్డిల్స్‌ (4వ స్థానం), హైజంప్‌ (9వ స్థానం), షాట్‌పుట్‌ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్‌ (3వ స్థానం), జావెలిన్‌ త్రో (9వ స్థానం),  800 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన అగసార నందిని కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో స్వప్నా బర్మన్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement