ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant)ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ధ్రువీకరించారు. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మాత్రమే కాకుండా, అత్యుత్తమ కెప్టెన్‌గా కూడా పంత్ ఎదుగుతాడని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.
రికార్డు ధర..
జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025(IPL 2025) మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. వేలంలో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడిన సూపర్ జెయింట్స్.. రైట్ టూ మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎదుర్కొని మరీ పంత్‌ను సొంతం చేసుకుంది.
కాగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-2021 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగు పెట్టింది. గత మూడు సీజన్లలో కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు సార్లు ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టినప్పటికి తుది పోరుకు ఆర్హత సాధించలేకపోయింది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో రిటైన్ చేసుకోలేదు.
దీంతో ఈ ఏడాది సీజన్‌లో కేఎల్ రాహుల్ స్ధానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడు. కాగా తొలుత లక్నో కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ఎంపిక అవుతాడని వార్తలు వినిపించాయి. కానీ లక్నో యాజమాన్యం మాత్రం పంత్ వైపే మొగ్గు చూపింది.
రెండో జట్టుకు కెప్టెన్‌గా..
కాగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పంత్‌కు అనుభవం ఉంది. 2016 సీజన్‌తో ఐపీఎల్ అరంగేంట్రం చేసిన రిషబ్ పంత్.. అప్పటి నుంచి గతేడాది సీజన్‌కు అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 2024 వరకు ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పని చేశాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్‌కు మాత్రం దూరమయ్యాడు. మళ్లీ గతేడాది సీజన్‌తో పంత్ రీఎంట్రీ ఇచ్చాడు.
వ్యక్తిగత ప్రదర్శతనతో అతడు ఆకట్టుకున్నప్పటికి.. సారథిగా మాత్రం జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి నాయకత్వంలోని ఢిల్లీ జట్టు లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యంతో పంత్‌కు విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపించాయి.
ఈ కారణంగానే ఢిల్లీ ఫ్రాంచైజీతో పంత్ తెగదింపులు చేసుకున్నాడని, క్యాపిటల్స్ కూడా అతడిని రిటైన్ చేసుకోలేదని జోరుగా ప్రచారం సాగింది. ఏదమైనప్పటికి వేలంలోకి వచ్చిన పంత్‌కు మాత్రం కళ్లు చెదిరే ధర దక్కింది. పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 43 మ్యాచ్‌లు ఆడగా.. 24 విజయాలు, 19 ఓటములు చవిచూసింది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment