హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ (మే 13) జరిగిన మ్యాచ్‌లో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఓ నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థర్డ్ అంపైర్‌ని దూషిస్తూ, లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్ట్‌లు విసిరారు. దీంతో స్టేడియంలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
లక్నో శిబిరంలోని వారు మైదానంలోకి వచ్చారు. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ అభిమానుల ప్రవర్తించిన తీరు పట్ల లక్నో బృందంతో పాటు ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే లక్నో శిబిరంలోని వారికి అంపైర్లు సర్ధిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం మ్యాచ్ సజావుగా సాగింది. నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో పూరన్ విధ్వంసం సృష్టించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో లక్నో విజయానంతరం ఆ జట్టు అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియా వేదికగా అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారు. కొందరు ఆకతాయిలు చేసిన పనికి (బోల్ట్‌లు, నట్లు విసిరినందుకు గాను) వారు మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌నే బ్లేమ్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఎస్‌ఆర్‌హెచ్ ఓడిన వైనాన్ని అవమానిస్తున్నారు.
ఆకతాయిలు చేసిన చెత్త పనిని ప్రస్తావిస్తూ.. మీరు మాపై నట్లు, బోల్ట్‌లు విసిరారు.. మేము మిమ్మల్ని ప్లే ఆఫ్స్ చేరకుండా చేశామంటూ బలుపుతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సన్‌రైజర్స్ అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. అలూ లేదు సూలు లేదు, కొడుకు పేరు సొమలింగం అన్నట్లుంది లక్నో పరిస్థితి అంటూ వ్యంగ్యమైన కౌంటర్లిస్తున్నారు. తాము ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాము సరే.. అదేదో వారు టైటిల్ సాధించినంత బిల్డప్ ఇస్తున్నారంటూ గట్టిగా బదులిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment