LSG Vs DC: పంత్‌ అరుదైన ఘనతలు.. ఐపీఎల్‌లో తొలి కెప్టెన్‌గా | IPL 2024 LSG Vs DC: Rishabh Pant Becomes 3rd Youngest To Complete 3000 IPL Runs Another Rare Feat, See Details - Sakshi
Sakshi News home page

Rishabh Pant: పంత్‌ అరుదైన ఘనతలు.. ఐపీఎల్‌లో తొలి కెప్టెన్‌గా

Published Sat, Apr 13 2024 8:38 AM | Last Updated on Sat, Apr 13 2024 9:01 AM

LSG vs DC Pant Becomes 3rd Youngest To 3000 IPL Runs Another Rare Feat - Sakshi

రిషభ్‌ పంత్‌ (PC: DC)

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పంత్‌ ఈ ఫీట్లు నమోదు చేశాడు. కాగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో- ఢిల్లీ శుక్రవారం తలపడిన విషయం తెలిసిందే.

సొంతమైదానంలో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(39) మెరుగ్గా ఆడగా.. ఆఖర్లో ఆయుశ్‌ బదోని మెరుపు అర్ధ శతకం(35 బంతుల్లో 55)తో అజేయంగా నిలిచాడు. అతడి తోడుగా అర్షద్‌ ఖాన్‌(20- నాటౌట్‌) కూడా రాణించాడు. 

ఫలితంగా ఓ దశలో కనీసం 130 పరుగుల మార్కు అందుకుంటుందో లేదోనన్న సందేహాల నడుమ లక్నో 167 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా ఢిల్లీ నిలదొక్కుకుంది. ఓపెనర్‌ పృథ్వీ షా(32), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌- మెక్‌గర్క్‌(35 బంతుల్లో 55) ఇన్నింగ్స్‌ చక్కదిద్దగా.. పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 24 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు సాధించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌(15), షాయీ హోప్‌(11) చివరి వరకు అజేయంగా నిలిచి 18.1 ఓవర్లోనే ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశారు. ఆరు వికెట్ల తేడాతో లక్నోపై గెలుపొందిన ఢిల్లీ ఈ సీజన్‌లో ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసింది.

తొలి కెప్టెన్‌గా
ఇక ఘోర ప్రమాదం తర్వాత దాదాపు ఏడాదిన్నరకు ఐపీఎల్‌-2024 ద్వారా తిరిగి కాంపిటేటివ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌.. ఇప్పటి వరకు వరుసగా 18, 28, 51, 55, 41 పరుగులు సాధించాడు. అదే విధంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 160కి పైగా స్కోరును ఛేదించిన తొలి జట్టుగా ఢిల్లీ, ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా పంత్‌ నిలిచాడు. 

మూడో బ్యాటర్‌గా 
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల 191 రోజు వయసులో ఈ ఘనత సాధించాడు. తద్వారా శుబ్‌మన్‌ గిల్‌(24 ఏళ్ల 215 రోజులు), విరాట్‌ కోహ్లి(26 ఏళ్ల 186 రోజుల) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

వాళ్లిద్దరి తర్వాత అతడే
కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఓవరాల్‌గా 25 మంది బ్యాటర్లు 3 వేల పరుగులు స్కోరు చేశారు. అయితే, వీరిలో స్ట్రైక్‌రేటు పరంగా ఏబీ డివిలియర్స్‌(151.68), క్రిస్‌ గేల్‌(148.96)లకు పంత్‌ మాత్రమే చేరువగా వచ్చాడు. ఈ జాబితాలో 148.4 స్ట్రైక్‌రేటుతో రిషభ్‌ పంత్‌ మూడో స్థానంలో నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement