Photo Courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్‌లో అన్నాదమ్ముల జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్.. కృనాల్ పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఇవాళ (మే 10) మరోసారి అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరి 8 విజయాలు సాధించగా, లక్నో 16 పాయింట్లతో 0.703 రన్‌రేట్, గుజరాత్ 16 పాయింట్లతో 0.120 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
సీజన్ తొలి అర్ధ భాగంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, నేటి మ్యాచ్‌లో రాహుల్ సేన అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్.. మహ్మద్ షమీ (3/25) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టును 158 పరుగులకే కట్టడి చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్‌లో తెవాతియా (40*) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
నేటి మ్యాచ్‌లో గుజరాత్, లక్నో జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..
- గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 50 వికెట్ల క్లబ్‌లో చేరతాడు
- లక్నో ఆల్‌రైండర్ కృనాల్ నేటి మ్యాచ్‌లో మరో సిక్సర్ బాదితే ఐపీఎల్‌లో 50 సిక్సర్ల మైలురాయి చేరుకుంటాడు
- లక్నో ఓపెనర్ డికాక్ మరో 6 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో అరుదైన 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
- గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
- లక్నో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ మరో మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు
- గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ 100 ఐపీఎల్ వికెట్లకు మరో 6 వికెట్ల దూరంలో ఉన్నాడు
- లక్నో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ 50 ఐపీఎల్ వికెట్లకు 3 వికెట్ల దూరంలో ఉన్నాడు
చదవండి: టాప్ టు జట్ల మధ్య పోరు.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..?
Comments
Please login to add a commentAdd a comment