సామ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్
20 పరుగులతో లక్నో ఓటమి
కేఎల్ రాహుల్, పూరన్ శ్రమ వృథా
జైపూర్: ఈ ఐపీఎల్‌లో చెన్నై, పంజాబ్, కోల్‌కతాలాగే సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్ కూడా విజయంతో సీజన్‌కు శ్రీకారం చుట్టింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ సంజూ సామ్సన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది.
టాస్ నెగ్గిన రాజస్తాన్ ముందుగా 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. తర్వాత లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులే చేసి ఓడిపోయింది. నికోలస్ పూరన్ ((41 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (44 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
సంజూ... ఓ రేంజ్‌లో!
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (11; 2 ఫోర్లు)ల వేగానికి ఆదిలోనే సీమర్లు మోసిన్, నవీనుల్ కళ్లెం వేశారు. మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన సామ్సన్‌కు ఆరో ఓవర్లో రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్) జతయ్యాక రాజస్తాన్ ఆట మారిపోయింది. ఇద్దరు కలిసికట్టుగా లక్నో బౌలర్లపై వేగంగా పరుగులు రాబట్టారు.
యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో చూడచక్కని సిక్సర్లతో అలరించారు. 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న సామ్సన్ ఆఖరిదాకా క్రీజ్ వీడలేదు, వేగం మానలేదు. మూడో వికెట్‌కు సామ్సన్, పరాగ్ 93 పరుగులు జోడించాక పరాగ్ అవుటయ్యాడు. హెట్‌మైర్ (5) నిరాశపరచగా, డెత్ ఓవర్లలో కెపె్టన్‌తో కలిసి ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడాడు.
ఆరంభంలోనే...
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సూపర్ జెయింట్స్ ఆరంభంలోనే కష్టాల పాలైంది. ఓపెనర్ డికాక్ (4), దేవదత్ పడిక్కల్ (0), ఆయుశ్ బదోని (1)లను బౌల్ట్, బర్గర్ పడగొట్టేశారు. అపుడు లక్నో స్కోరు 11/3. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ రాహుల్ అడపాదడపా షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తుంటే... దీపక్ హుడా (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసే పనిలో చహల్ మ్యాజిక్‌కు బోల్తా పడ్డాడు.
రాహుల్, పూరన్ చాలాసేపు క్రీజులో నిలవడంతో 16వ ఓవర్ వరకు 145/4 స్కోరు వద్ద లక్నోకు గెలిచే చాన్స్ కనిపించింది. 24 బంతుల్లో 49 పరుగుల సమీకరణం వద్ద రాహుల్‌ను సందీప్... మరుసటి ఓవర్లో హిట్టర్ స్టోయినిస్ (3)ను అశి్వన్ అవుట్ చేయడంతో సూపర్ జెయింట్స్ లక్ష్యానికి దూరమైంది.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) కృనాల్ (బి) మోసిన్ 24; బట్లర్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 11; సామ్సన్ (నాటౌట్) 82; పరాగ్ (సి) సబ్–హుడా (బి) నవీనుల్ 43; హెట్‌మైర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 5; జురెల్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–13, 2–49, 3–142, 4–150. బౌలింగ్: మోసిన్ 4–0–45–1, నవీనుల్ 4–0–41–2, కృనాల్ పాండ్యా 4–0–19–0, రవి బిష్ణోయ్ 4–0–38–1, యశ్ ఠాకూర్ 3–0–43–0, ఆయుశ్ 1–0–6–0.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 4; రాహుల్ (సి) జురెల్ (బి) సందీప్ 58; పడిక్కల్ (బి) బౌల్ట్ 0; బదోని (సి) బట్లర్ (బి) బర్గర్ 1; హుడా (సి) జురెల్ (బి) చహల్ 26; పూరన్ (నాటౌట్) 64; స్టొయినిస్ (సి) జురెల్ (బి) అశి్వన్ 3; కృనాల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–4, 2–10, 3–11, 4–60, 5–145, 6–154. బౌలింగ్: బౌల్ట్ 4–0–35–2, బర్గర్ 3–0–30–1, అశి్వన్ 4–0–35–1, అవేశ్ ఖాన్ 3–0–21–0, చహల్ 3–0–25–1, సందీప్ శర్మ 3–0–22–1.
Comments
Please login to add a commentAdd a comment