సన్‌‘రైజ్‌’ కాలేదు! హైదరాబాద్‌కు రెండో ఓటమి.. కృనాల్ ఆల్‌రౌండ్‌ షో.. | Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 5 wickets | Sakshi
Sakshi News home page

SRH: సన్‌‘రైజ్‌’ కాలేదు! హైదరాబాద్‌కు రెండో ఓటమి.. కృనాల్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన   

Published Sat, Apr 8 2023 2:42 AM | Last Updated on Sat, Apr 8 2023 2:47 AM

Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 5 wickets - Sakshi

లక్నో: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ సీజన్‌లో రెండో మ్యాచ్‌ కూడా కలిసి రాలేదు. సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇప్పుడు సమష్టి వైఫల్యంతో ప్రత్యర్థి వేదికపై పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (41 బంతుల్లో 34; 4 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును గెలిపించారు.  

బ్యాటింగ్‌ వైఫల్యం... 
ఆటగాళ్లు మారినా, సన్‌రైజర్స్‌ ఆట మారలేదు. మొదటి మ్యాచ్‌ ఓటమి నుంచి ఆ జట్టు పాఠాలు నేర్చుకున్నట్లుగా లేదు. దాదాపు అదే తరహాలో పేలవ బ్యాటింగ్‌తో మరోసారి టీమ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (8) మళ్లీ విఫలం కాగా, అన్‌మోల్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది.

అయితే కృనాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ రైజర్స్‌ను దెబ్బ తీసింది. అన్‌మోల్‌ను ఎల్బీగా అవుట్‌ చేసిన కృనాల్‌ తర్వాతి బంతికి కెపె్టన్‌ మార్క్‌రమ్‌ (0)ను వెనక్కి పంపాడు. హైదరాబాద్‌ టీమ్‌కు సారథిగా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో మార్క్‌రమ్‌ తొలి బంతికే వెనుదిరగాల్సి వచ్చిం ది. హ్యారీ బ్రూక్‌ (3) కూడా ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు 55/4కు చేరింది. ఈ దశలో త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌ (16) కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే లక్నో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రావడం కష్టంగా మారిపోవడంతో బంతులు వృథా అయ్యాయి. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 పరుగులు జత చేసినా... ఏకంగా 50 బంతులు తీసుకొని మూడే ఫోర్లు కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన సన్‌ టీమ్‌ అతి కష్టమ్మీద వంద పరుగులు దాటగలిగింది. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు జోడించగలిగాడు.  

కీలక భాగస్వామ్యం... 
ఛేదనలో ఆరంభంలో లక్నో కొంత తడబడింది. పవర్‌ప్లేలో 45 పరుగులు చేసిన ఆ జట్టు మేయర్స్‌ (13), దీపక్‌ హుడా (7) వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కృనాల్‌ భాగస్వామ్యం టీమ్‌ను విజయానికి చేరువ చేసింది. వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ ద్వయం మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించారు. వీరిద్దరితో పాటు షెఫర్డ్‌ (0)ను తక్కువ వ్యవధిలో సన్‌రైజర్స్‌ వెనక్కి పంపగలిగినా... అప్పటికే జెయింట్స్‌ విజయం దాదాపు ఖాయమైంది.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అన్‌మోల్‌ప్రీత్‌ (ఎల్బీ) (బి) కృనాల్‌ 31; మయాంక్‌ (సి) స్టొయినిస్‌ (బి) కృనాల్‌ 8; త్రిపాఠి (సి) మిశ్రా (బి) యష్‌ 34; మార్క్‌రమ్‌ (బి) కృనాల్‌ 0; బ్రూక్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 3; సుందర్‌ (సి) హుడా (బి) మిశ్రా 16; సమద్‌ (నాటౌట్‌) 21; రషీద్‌ (సి) హుడా (బి) మిశ్రా 4; ఉమ్రాన్‌ (రనౌట్‌) 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–21, 2–50, 3–50, 4–55, 5–94, 6–104, 7–108, 8–109. బౌలింగ్‌: మేయర్స్‌ 1–0–5–0, ఉనాద్కట్‌ 3–0–26–0, కృనాల్‌ 4–0–18–3, యష్‌ 3–0– 23–1, బిష్ణోయ్‌ 4–0–16–1, హుడా 1–0–8–0, అమిత్‌ మిశ్రా 4–0–23–2.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) మయాంక్‌ (బి) ఫజల్‌ 13; రాహుల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 35; హుడా (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 7; కృనాల్‌ (సి) అన్‌మోల్‌ప్రీత్‌ (బి) ఉమ్రాన్‌ 34; స్టొయినిస్‌ (నాటౌట్‌) 10; షెఫర్డ్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 0; పూరన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (16 ఓవర్లలో 5 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–35, 2–45, 3–100, 4–114, 5–114. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0– 19–1, సుందర్‌ 1–0–11–0, ఫజల్‌ 3–0–13–1, మార్క్‌రమ్‌ 2–0–14–0, రషీద్‌ 3–0–23–2, నటరాజన్‌ 3–0–23–0, ఉమ్రాన్‌ 2–0–22–1.   

ఐపీఎల్‌లో నేడు 
రాజస్తాన్‌ VS ఢిల్లీ (మ. గం. 3:30 నుంచి) 
ముంబై VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి )

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement