మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది.
ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్‌లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్‌టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment