రిషభ్ పంత్ (PC: BCCI)
IPL 2024- Rishabh Pant : టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే పంత్ బరిలోకి దిగాలని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా 2022, డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు.
క్రమక్రమంగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన పంత్.. ఐపీఎల్-2024 సీజన్‌తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈసారి పంత్ తమ జట్టు కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపడతాడని తెలిపింది.
అయితే, తొలి అర్ధ భాగంలో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడని.. వికెట్ కీపింగ్ చేయడని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంత్ రీఎంట్రీ విషయంలో హడావుడి వద్దని బీసీసీఐ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జట్టుకు దూరంగా ఉండాలంటే కష్టమే..
ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరంగా ఉండటం కష్టమే. అయితే, పూర్తిగా కోలుకోకముందే హడావుడిగా మైదానంలో దిగాలని భావిస్తే మళ్లీ గాయపడే అవకాశం ఉంది.
అదే జరిగితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అప్పుడు మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాలంటే చిరాకుగా ఉంటుంది. కాబట్టి పునరాగమనం విషయంలో ఆచితూచి.. ఆలోచించుకుని.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటేనే పంత్ మళ్లీ బ్యాట్ పట్టాలి.
టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం!
అతడు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయడం శుభపరిణామం. ఏదేమైనా రీఎంట్రీ విషయంలో తొందరపాటు వద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పంత్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment