ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.
ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.
ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.
26 బంతుల్లో 52 పరుగులు
వర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్
ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment