ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు రివార్డు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా బ్రేస్‌వెల్‌ | Michael Bracewell To Captain New Zealand For Pakistan T20Is, Check Squad Details And Matches Schedule Inside | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు రివార్డు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా బ్రేస్‌వెల్‌

Published Tue, Mar 11 2025 8:22 AM | Last Updated on Tue, Mar 11 2025 9:16 AM

Michael Bracewell To Captain New Zealand For Pakistan T20Is

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు గానూ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌కు రివార్డు లభించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ జాతీయ జట్టు పగ్గాలు చేపట్టడం బ్రేస్‌వెల్‌కు ఇది మొదటిసారి. గతేడాది బ్రేస్‌వెల్‌ ఇదే పాకిస్తాన్‌పై (పాకస్తాన్‌లో) ఓ సారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

అప్పడు న్యూజిలాండ్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఈసారి కూడా పాక్‌తో జరుగబోయే సిరీస్‌ కోసం​ ఎంపిక చేసిన న్యూజిలాండ్‌ జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడిన న్యూజిలాండ్‌ జట్టులో నుంచి కేవలం ఏడుగురు మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ విశ్రాంతి తీసుకోవడంతో బ్రేస్‌వెల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

పాక్‌తో సిరీస్‌కు ఛాంపియన్స్‌ ట్రోఫీ హీరో రచిన్‌ రవీంద్రతో పాటు స్టార్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌ కూడా ఎంపిక కాలేదు. ఈ ముగ్గురికి న్యూజిలాండ్‌ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన పేసర్‌ లోకీ ఫెర్గూసన్‌ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫెర్గూసన్‌ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. 

విదేశీ లీగ్‌ల కమిట్‌మెంట్స్‌ కారణంగా గత సిరీస్‌కు దూరంగా ఉన్న టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌, జేమ్స్‌ నీషమ్‌ పాక్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. లంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోధి తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన పేసర్‌ బెన్‌ సియర్స్‌ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. వర్క్‌ లోడ్‌ కారణంగా పేసర్లు కైల్‌ జేమీసన్‌, విలియమ్‌ ఓరూర్కీ తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపికయ్యారు. 

కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల బ్రేస్‌వెల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. టీ20ల్లో పాక్‌ బలమైన ప్రత్యర్థి అని, వారిని ఎదుర్కొనేందుకు ఆతృతగా ఉన్నాయని తెలిపాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఓడటంతో ఆటగాళ్లు కాస్త నిరుత్సాపడ్డారని.. పాక్‌తో సిరీస్‌ సమయానికి మామూలు స్థితికి వస్తారని పేర్కొన్నాడు.  వైట్‌ బాల్‌ కెప్టెన్‌గా సాంట్నర్‌ లెగసీకి కొనసాగిస్తానని తెలిపాడు. 

కాగా, న్యూజిలాండ్‌లో పాక్‌ పర్యటన మార్చి 16న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్‌ 5 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. 

పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి

న్యూజిలాండ్‌ పర్యటనలో పాక్‌ షెడ్యూల్‌..
మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)
మార్చి 18- రెండో టీ20 (డునెడిన్‌)
మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్‌)
మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్‌ మౌంగనూయ్‌)
మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్‌)

మార్చి 29- తొలి వన్డే (నేపియర్‌)
ఏప్రిల్‌ 2- రెండో వన్డే (హ్యామిల్టన్‌)
ఏప్రిల్‌ 5- మూడో వన్డే (మౌంట్‌ మౌంగనూయ్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement