టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానునున్నట్లు సమాచారం. మణికట్టు గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్.. దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు ఆఖరి వారంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రోటీస్‌తో మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది.
కంగారు జట్టు ప్రోటీస్ టూర్ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగియనుంది. అనంతరం ఆస్ట్రేలియా నేరుగా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకోనుంది. అతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండు పర్యటనలకు దూరంగా ఉండనున్న కమ్మిన్స్.. తిరిగి మళ్లీ వరల్డ్‌కప్‌కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా మిచెల్ మార్ష్..
ఇక దక్షిణాఫ్రికా, భారత పర్యటనలలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ గైర్హజరీ నేపథ్యంలో అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆస్ట్రేలియా క్రికెట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్ష్ గత కొంత కాలంగా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్‌లలో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన ఆటతో పాటు కెప్టెన్సీ చేసే సత్తా కూడా ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్‌స్కార్చర్స్ కెప్టెన్‌గా మార్ష్ వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం కంగారు జట్టుకు శాశ్వత కెప్టెన్ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్ ఫించ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. ఈ క్రమంలో మిచిల్ మార్ష్ ఆసీస్ టీ20 కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్నాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!
Comments
Please login to add a commentAdd a comment