మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. నిన్న (జులై 24) శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో (6 పాయింట్లు) రెండో స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన సీయాటిల్ ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. నాలుగో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (4), శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (4) పోటీపడుతుండగా.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ (2) లీగ్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), చైతన్య బిష్ణోయ్ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. స్టోయినిస్ (13), షాదాబ్ ఖాన్ (20), కోరె ఆండర్సన్ (14), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన డేనియల్ సామ్స్..
తొలుత బంతితో రాణించిన సామ్స్ (2/47) ఆతర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 42 పరుగులు చేసిన సామ్స్ సూపర్‌కింగ్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 172 పరుగుల లక్ష్య ఛేదనలో సామ్స్‌తో పాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే (30), మిలింద్ కుమార్ (52) కూడా రాణించారు.
సామ్స్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. యునికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు.. రోక్స్, ప్లంకెట్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment