MLC 2023: Texas Super Kings beats Los Angeles Knight Riders by 69 runs - Sakshi
Sakshi News home page

MLC 2023: తగ్గేదేలేదంటున్న సూపర్‌ కింగ్స్‌.. ధోని లేకపోయినా..!

Published Fri, Jul 14 2023 5:52 PM | Last Updated on Fri, Jul 14 2023 6:22 PM

MLC 2023: Trend Continues For Men In Yellow, Super Kings Won One More League Opener - Sakshi

లీగ్‌ క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, దాని అనుబంధ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. లీగ్‌ ఏదైనా పసుపు దళం తగ్గేదేలేదంటుంది. ఐపీఎల్‌లో 5సార్లు ఛాంపియన్‌గా నిలిచి లీగ్‌ క్రికెట్‌లో మకుటం లేని మహారాజులా చలామణి అవుతున్న సీఎస్‌కే.. ఈ ఏడాదే మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పేరిట ఎంట్రీ ఇచ్చి సెమీఫైనల్‌ వరకు చేరుకుంది. తాజాగా ఎల్లో ఆర్మీ.. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ పేరిట మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లోకి అడుపెట్టింది. వచ్చీ రాగానే సూపర్‌ కింగ్స్‌ ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 

నిన్న (జులై 13) జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌కే.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌పై 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మినీ సీఎస్‌కేలా కనిపించిన టీఎస్‌కే.. సీఎస్‌కే తరహాలోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టి ఎంఎల్‌సీలో తమ ప్రస్తానాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఈ క్రమంలో సూపర్‌ కింగ్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. లీగ్‌ క్రికెట్‌లో ఎన్‌ శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలోని సూపర్‌ కింగ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాంచైజెస్‌.. ప్రపంచంలోని మేజర్‌ క్రికెట్‌‌ లీగ్‌లన్నింటిలో తమ ప్రస్తానాన్ని విజయంతో ప్రారంభించాయి. 

2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో నాటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌పై విజయంతో లీగ్‌ క్రికెట్‌లో తమ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన సూపర్‌ కింగ్స్‌.. ఇదే ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ తమ ప్రస్తానాన్ని విజయంతోనే (డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌పై విజయం) ప్రారంభించింది. తాజాగా ఎంఎల్‌సీని కూడా విజయంతో ప్రారంభించిన సూపర్‌ కింగ్స్‌.. ప్రపంచవ్యాప్తంగా తాము పాల్గొంటున్న ప్రతి లీగ్‌లో విజయంతోనే ఖాతా తెరిచింది.

ధోని లేకపోయినా..
సీఎస్‌కే అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించింది. భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకూడదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో ఎంఎల్‌సీలో సూపర్‌ కింగ్స్‌కు ధోని కాకుండా ఫాఫ్‌ డుప్లెసిస్‌ నాయకత్వం వహిస్తున్నాడు.

ఎంఎల్‌సీలో సూపర్‌ కింగ్స్‌తో ధోని లేకపోయినా, ఆ జట్టు విజయంతోనే ఖాతా తెరిచింది. సీఎస్‌కే ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (55) ఎంఎల్‌సీలోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. సీఎస్‌కే సభ్యులు మిచెల్‌ సాంట్నర్‌ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్‌ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి, తమ జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement