సిడ్నీ: అడిలైడ్ వేదికగా డిసెంబరు 17 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా- ఆసీస్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. తొలి డే- నైట్ టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్‌ల ద్వారా ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఈ మ్యాచ్ భారత జట్టు కూర్పునకు దోహదం చేయగా.. ఆఖరి రోజు ఆస్ట్రేలియా ‘ఏ’ బ్యాట్స్‌మన్ అదరగొట్టినప్పటికీ గాయాల బెడద ఆ జట్టుకు సమస్యగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల అంశం కంగారూలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్ పకోవ్‌స్కీ కన్‌షన్ కాగా.. అతడి స్థానంలో వచ్చిన హారిస్ విఫలమయ్యాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్)
దీంతో ఓపెనింగ్ సమస్య ఆసీస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్‌నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అదే సమయంలో ఫించ్, వార్నర్, స్మిత్ వంటి ఆటగాళ్లు మాత్రం సంయమనంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు. వారంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు కావడమే ఇందుకు కారణం అని పేర్కొన్నాడు. ‘‘ ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ గానీ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి వాళ్లు భారత ఆటగాళ్లతో వాగ్యుద్దానికి దిగే అవకాశమే లేదు. కానీ టిమ్ పైన్ అలా కాదు. అతడు ఐపీఎల్ ఆడటం లేదు. (చదవండి: వైరల్: కూల్ కెప్టెన్.. అంతగా ఆవేశపడితే ఎలా!!)
ఇండియాకు వెళ్లే అవసరం లేదని తనకు తెలుసు. కాబట్టి కచ్చితంగా రెచ్చిపోతాడు. భారత ఆటగాళ్లను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఐపీఎల్‌తో పాటు మరో కారణం కూడా ఉంది. నిజానికి స్మిత్, వార్నర్‌పై బాల్ టాంపరింగ్ వివాదంలో సస్పెండ్ అయినపుడు పైన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో తిరిగి చోటు సంపాదించుకున్నారు. ఒకవేళ ఈ టెస్టు సిరీస్‌లో గనుక పైన్ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే అతడిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జట్టు సారథ్య బాధ్యతల విషయం పక్కన పెడితే తుదిజట్టులో స్థానం సంపాదించుకోవడమే కష్టంగా మారుతుంది. కాబట్టి అతడు వీలైనంత దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. పర్యాటక జట్టుతో మాటల యుద్ధానికి దిగే బదులు ఆట మీద దృష్టి సారిస్తే కాస్తైనా ఫలితం ఉంటుందని హితవు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment