అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ డే/నైట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.
రోహిత్ సేన మాత్రం మూడు విభాగాల్లో విఫలమైన ఆసీస్ ముందు మోకరల్లింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
దీంతో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలా భారత పేసర్లందుకు తెలివిగా ఆలోచించడం లేదని కైఫ్ ప్రశ్నించాడు.
"స్కాట్ బోలాండ్ ఆసీస్ జట్టులో రెగ్యూలర్‌గా ఉండడు. కానీ అతడికి విరాట్ కోహ్లిని ఎలా ఔట్ చేయాలో తెలుసు. జట్టులో స్ధిరంగా ఉండని బౌలరే కోహ్లిని ట్రాప్ చేసినప్పుడు, మీరెందుకు ట్రావిస్ హెడ్‌ని అడ్డుకోలేకపోయారు. ప్రతీ బ్యాటర్‌కు ఓ వీక్‌నెస్ ఉంటుంది.
హెడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే హెడ్ ఔటయ్యే అవకాశముంటుంది. అటువంటిప్పుడు మీరు ఎందుకు అదే లైన్‌లో నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం మనం ఆసీస్ బౌలర్లను చూసి నేర్చుకోవాలి.
విరాట్ కోహ్లి బలహీనత అందరికీ తెలుసు. ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే విరాట్ ఔటయ్యే అవకాశముంది. అందుకే ఆసీస్ బౌలర్లు అదే లైన్‌లో అతడికి బౌలింగ్ చేస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్, రెండో ఇన్నింగ్స్‌లో బోలాండే అదే పనిచేశారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా ట్రావిస్ హెడ్‌కి వ్యతిరేకంగా భారత బౌలర్లు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి.
సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి బంతి నుంచే అతడిని ఎటాక్ చేయాలి. హెడ్‌కు ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. పక్కా ప్రణాళికతో అతడిని ఔట్ చేయాలని" ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: భారత్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment